ఇమ్రాన్‌ బదులు సచిన్‌ ఫొటో.. జోకులే జోకులు

23 Jun, 2019 11:36 IST|Sakshi

పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ అనుచరుడు నయీమ్‌ ఉల్‌ హక్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోపై జోకులు పేలుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ 1969 అంటూ ఓ ఫొటోను నయీమ్‌ ట్వీట్‌ చేశాడు. అయితే అది క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఫొటో కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు. పలువురు సెలబ్రిటీల ఫొటోలకు వారి పోలికలతో ఇతర ప్రముఖుల పేర్లు పెడుతూ నయీమ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఆర్భాజ్‌ఖాన్‌ ఫొటోను షేర్‌ చేసిన ఓ నెటిజన్‌.. దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ 2010 అని పేర్కొనగా... మరొకరు సల్మాన్‌ ఖాన్‌ ఫొటోకు షోయబ్‌ అక్తర్ అని కామెంట్‌ జత చేశాడు. ప్రస్తుతం నయీమ్‌ ట్వీట్‌ వైరల్‌గా మారడంతో ఇమ్రాన్‌ అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ‌16 ఏళ్ల వయస్సులో క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన ఇమ్రాన్‌ ఖాన్‌.. 1969లో తన సొంత జట్టు లాహోర్‌ ఏ తరఫున అరంగేట్రం చేశాడు. తదనంతర కాలంలో జాతీయ జట్టు కెప్టెన్‌గా ఎదిగి పాక్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఇక 1992లో పాక్‌కు ప్రపంచకప్‌ సాధించి పెట్టి పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. తొలి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన సారథ్యంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) అత్యధిక స్థానాలు గెలుచుకుని, అతి పెద్ద పార్టీగా అవతరించి అధికారం సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు