డేటా... దూకుడు!

29 Oct, 2019 02:39 IST|Sakshi

సోషల్‌ మీడియా వినియోగంలో భారతీయులే నంబర్‌ 1

‘సెన్సర్‌ టవర్‌ డేటా’ గణాంకాల్లో వెల్లడి

ఉదయాన్నే లేస్తూ ఓ సెల్పీ.. వెంటనే దానిని ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో పోస్టింగ్‌.. కొత్త సాంగ్‌ వచ్చిందా.. కొత్త స్టెప్పులు నేర్చుకుని వెంటనే టిక్‌టాక్‌లో డాన్సింగ్‌.. ఈసారి నా డబ్‌స్మాష్‌ వీడియో యూట్యూబ్‌లో ఎలాగైనా సరే వైరల్‌ అవ్వాల్సిందే.. ఇవీ భారతీయుల ఆలోచనలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇంటర్నెట్‌ను తెగ వాడేస్తున్నారు. ఎంతలా అంటే ప్రపంచంలో డేటా వినియోగిస్తున్న వారిలో మనమే టాప్‌లో ఉండేంతలా. ఇదే విషయాన్ని మొబైల్‌ యాప్స్‌ల రేటింగ్‌లను నిర్ధారించే ‘సెన్సర్‌ టవర్‌ డేటా’ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
– సాక్షి, హైదరాబాద్‌

ప్రస్తుత దేశ జనాభా దాదాపు 130 కోట్లు. ప్రపంచ దేశాలన్నింటికీ అతిపెద్ద మార్కెట్‌ మన దేశమే. అందుకు సోషల్‌ మీడియా ఏమీ తీసి పోదు. అందుబాటులోకి వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌ ధర లు, ఇంటర్నెట్‌ డేటా ప్యాకేజీల వల్ల సోషల్‌ మీడియా వాడకంలో పట్టణాలు, పల్లెల్లోనూ అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. ఎంత లా అంటే ప్రపంచ సోషల్‌మీడియా వాడకంలో మనదే 40% భాగస్వామ్యం ఉండేంతలా.  సోషల్‌ మీడియాలో ఎన్ని కొత్త యాప్‌లు వచ్చిన ఇండియాలో వాటికి కొత్త వినియోగదారులు పుట్టుకొస్తూనే ఉన్నారు. టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్‌లకు సంబంధించి ఇండియన్ల వినియోగం అసాధా రణ స్థాయిలో ఉంది. అమెరికా, యూరప్‌లను తలదన్ని మనదేశం అగ్రస్థానం దక్కించుకుంది.

టిక్‌టాక్‌..
కొంతకాలంగా టిక్‌టాక్‌ సృష్టిస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. యువత, టీనేజీ, పిల్లలు, వృద్ధులు అంతా దీన్ని తెగవాడేస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ యాప్‌ను అధికం(44 శాతం)గా మనమే డౌన్‌లోడ్‌ చేసుకున్నాం. ఒక్క సెప్టెంబర్‌లోనే 6 కోట్ల మంది ఈ యాప్‌ను కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ యాప్‌ క్రేజ్‌ ఎంతగా ఉందో. మార్చిలో టిక్‌టాక్‌ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేయగా అందులో 8 కోట్ల మంది భారతీయులే కావడం గమనార్హం. 15 సెకన్లకు ఓ కొత్త వీడియో ఇందులో అప్‌లోడ్‌ అవుతోంది. ప్రధాన సోషల్‌ మీడియా యాప్‌లైన ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు ఇది తీవ్ర పోటీనిస్తోంది. వినియోగంలో భారత్‌ టాప్‌ప్లేస్‌లో ఉండగా.. అమెరికా, టర్కీ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

మరికొన్ని విశేషాలు
►టిక్‌టాక్‌లో 41 శాతం మంది 16 నుంచి 24 ఏళ్ల వయసులోపు వారే.
►యూజర్లలో 56 శాతం పురుషులు,44 శాతం మహిళలు.
►ప్రతీరోజు సగటు వినియోగదారుడు గడుపుతున్న సమయం 52 నిమిషాలు.
►90 శాతం వినియోగదారులు రోజుకు ఒక్కసారైనా యాప్‌ ఓపెన్‌ చేస్తున్నారు.
►ఇంతవరకూ టిక్‌టాక్‌ చూసిన వారి సంఖ్య సరాసరిగా 100 కోట్లు.

ఫేస్‌బుక్‌..
ఫేస్‌బుక్‌ యూజర్లు
ఇండియా 24.1 కోట్లు
అమెరికా 24 కోట్లు
ఇండోనేషియా 13 కోట్ల

ఫేస్‌బుక్‌ విషయానికి వస్తే.. గత నెలలో ఇండియన్లు అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ల్లో ఇది రెండోస్థానంలో నిలిచింది. ఈ సెప్టెంబర్‌లో ఇండియాలో కొత్తగా 5 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న 100 శాతంలో భారత్‌ భాగస్వామ్యం 23 శాతంగా నమోదైంది. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా భారతీయులు అధికంగా వినియోగిస్తున్న యాప్‌ల్లో ఫేస్‌బుక్‌ కూడా ఒకటి. ఎన్ని యాప్‌లొచ్చినా దీనికి ఉండే ఆదరణ తగ్గకపోవడం గమనార్హం. ఫేస్‌బుక్‌కి అగ్రరాజ్యం అమెరికాలో 24 కోట్ల మంది యూజర్లు ఉండగా.. భారత్‌లో మాత్రం 24.1 కోట్ల మంది ఉన్నారు. జనవరి నుంచి జూన్‌ వరకు ఫేస్‌బుక్‌ యూజర్ల పెరుగుదల భారత్‌లో 12 శాతంగా నమోదైంది.

యూట్యూబ్‌ యూజర్లు
అమెరికా50 కోట్లు
ఇండియా 24 కోట్లు
జపాన్‌12 కోట్లు

యూట్యూబ్‌కు సైతం..
ఇండియాలో ఆదరణ పెరుగు తున్న వాటిలో యూట్యూబ్‌ కూడా ముందువరసలో ఉంది. మన దేశంలో 26.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 1,200 చానళ్లకు 10 లక్షలకుపైగా సబ్‌స్క్రై బర్లు ఉన్నారు. ఐదేళ్ల క్రితం కేవలం 2 చానళ్లకు మాత్రమే 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉండేది. కాలక్రమంలో ఈ చానళ్లకు మంచి ఆదరణ దక్కుతోంది. వీటిలో 95 శాతం ప్రాంతీయ భాషలకు చెందినవి కావడం గమనార్హం. నీల్సన్‌ సర్వే ప్రకారం.. అధికంగా ఆదరణ ఉన్న వీడియోల్లో స్పోకెన్‌ ఇంగ్లిష్, ఇతర విద్యా సంబంధమైన కంటెంట్‌ ఉంది.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు