బాణాసంచా రాత్రంతా కాలుస్తాం ఏం చేస్తారు?

23 Oct, 2018 16:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సుప్రీం తీర్పుపై నెటిజన్ల ఫైర్‌

న్యూఢిల్లీ: దివాళీ సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే బాణాసంచా కాల్చాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆంక్షల పేరిట మతపర సెంటిమెంట్‌పై మరోసారి దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని తీర్పునిచ్చిన సుప్రీంపై హిందువులు, అయ్యప్ప భక్తులు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. తాజాగా క్రాకర్స్‌ విషయంలో ఇచ్చిన తీర్పు వారికి పుండు మీద కారం చల్లినట్లైంది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. 

దివాళీ రోజంతా బాణాసంచా కాల్చుతామని ఏం చేస్తారో.. చేసుకోండని సవాల్‌ విసురుతున్నారు. వెయ్యేళ్ల నుంచి కొనసాగుతున్న సాంప్రదాయన్ని అడ్డుకోవడం ఏంటని, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, షరియా, కమ్యూనిస్టుల్లా ఆలోచించడం మానేయాలని సూచిస్తున్నారు. దివాళీ తమకు సాంప్రదాయ పండుగని, బాణాసంచా కాల్చే విషయంలో సుప్రీం సలహాలు అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. బాణాసంచా విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికే విరుద్దమని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

పర్యావరణానికి హాని కలిగించే బాణాసంచాను నిషేదించాలని దాఖలైన పిటిషన్‌లను మంగళవారం విచారించిన సుప్రీం.. బాణాసంచా తయారీ, విక్రయాలను నిషేధించలేమని  పేర్కొంది. లైసెన్స్‌ కలిగిన వ్యాపారులే బాణాసంచా విక్రయించాలని, ఆన్‌లైన్‌లో ఈ కామర్స్‌ సైట్స్‌ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు విక్రయాలు జరపరాదని కూడా స్పష్టం చేసింది. అలాగే దివాళీ రోజు నిర్ధిష్ట సమయంలో మాత్రమే క్రాకర్స్‌ కాల్చాలని సూచించింది. (చదవండి: బాణాసంచా నిషేధంపై సుప్రీం కీలక తీర్పు)

మరిన్ని వార్తలు