ఫలించిన నిరుద్యోగి వినూత్న ప్రయత్నం

2 Aug, 2019 19:08 IST|Sakshi

ప్రస్తుత కాలంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో దాదాపు ప్రతి ఒక్కరికి అనుభవమే. అలాంటిది.. ఓ కంపెనీ తీసేసిన తర్వాత మరో చోట ఉద్యోగం పొందడం అంటే మాటలు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల మానసిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే వారిని కూడా చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితే పాట్రిక్‌ హోగ్లాండ్‌ అనే వ్యక్తికి ఎదురయ్యింది. రెజ్యూమ్‌ పట్టుకుని ఎన్నో చోట్ల తిరిగాడు. ఫలితం లేదు. తీవ్ర నిరాశకు లోనైన సమయంలో అతనికి వచ్చిన ఓ వినూత్న ఆలోచన అతడిని తిరిగి ఉద్యోగస్తుడిగా మార్చింది.

ఆ వివరాలు ఏంటో అతడి మాటల్లోనే.. ‘గతంలో నేను పని చేస్తున్న కంపెనీ నన్ను ఉద్యోగంలోంచి తీసేసింది. నెల రోజులు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాను. నాకు ఓ కుమారుడు. ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. దాంతో తిరిగి ఉద్యోగాన్వేషణలో పడ్డాను. ఆన్‌లైన్‌లో రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేయడం.. కంపెనీల చుట్టూ తిరగడం ఇలా చాలా ప్రయత్నాలు చేశాను. కానీ ప్రతి చోట నిరాశే ఎదురయ్యింది. ఏం చేయాలో పాలుపోలేదు. అలా ఉన్న సమయంలో నాకొక వినూత్న ఆలోచన వచ్చింది’ అన్నారు పాట్రిక్‌.

‘దాని ప్రకారం పదుల సంఖ్యలో రెజ్యూమ్‌లను ప్రింట్‌ తీయించాను. తర్వాత ‘నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు.. ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. దయచేసి ఓ రెజ్యూమ్‌ తీసుకొండి’ అని రాసి ఉన్న ఓ ప్ల కార్డు పట్టుకుని రద్దీగా ఉండే ప్రాంతంలో నిలబడే వాడిని. వచ్చి పోయే వారిని ఆపి నా గురించి చెప్పేవాడిని. తొలుత జనాలు నన్ను చూసి నవ్వేవారు. కానీ తర్వాత నా ప్రయత్నం గురించి ఆలోచించేవారు. ఈ క్రమంలో మెలిస్సా డిజియాన్‌ఫిలిప్పో అనే ఓ వ్యక్తి ద్వారా నా  ప్రయత్నం సోషల్‌ మీడియాకు ఎక్కడం, ఉద్యోగం పొందడం జరిగాయి’ అన్నాడు పాట్రిక్‌.

ఈ విషయం గురించి మెలిస్సా తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఓ రోజు నేను ఆఫీస్‌కు వెళ్తుండగా.. పాట్రిక్‌ కనిపించాడు. ఎర్రటి ఎండలో.. చెరగని చిరునవ్వుతో రోడ్డు మీద వచ్చిపోయే వారిని ఆపి.. తన ప్రయత్నం గురించి చెప్తూ.. రెజ్యూమ్‌ ఇస్తున్నాడు. అతని ఆలోచన నాకు నచ్చింది. దాంతో రెజ్యూమ్‌ తీసుకుని.. నాకు తెలిసిన వారి కంపెనీలకు పంపించాను. మీరు కూడా తనకు సాయం చేయండి’ అంటూ మెలిస్సా తన ఫేస్‌బుక్‌లో పాట్రిక్‌ రెజ్యూమ్‌ని పోస్ట్‌ చేశాడు.

ఈ పోస్ట్‌కు ఊహించనంత స్పందన వచ్చింది. చాలా మంది పాట్రిక్‌ ప్రయత్నాన్ని మెచ్చుకోవడమే కాక.. తమకు తెలిసిన చోటల్లా పాట్రిక్‌ గురించి చెప్పడం ప్రారంభించారు. చాలా కొద్ది రోజుల్లోనే పాట్రిక్‌కు ఉద్యోగం ఇస్తామంటూ చాలా మంది ముందుకు వచ్చారు. ప్రస్తుతం పాట్రిక్‌ ఓ మహిళా కాంట్రక్టర్‌ దగ్గర ఉద్యోగంలో చేరాడు. తనకు సాయం చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు పాట్రిక్‌. ప్రస్తుతం ఈ స్టోరి ఫేస్‌బుక్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు