ఐదేళ్లప్పుడు సాయం.. 24 ఏళ్ల తర్వాత కృతజ్ఞతలు

15 Aug, 2019 13:05 IST|Sakshi

సాయం చేసిన వారు ఎదురుపడితే.. ఎక్కడ వారికి తిరిగి సాయం చేయాల్సి వస్తుందో అని మొహం తిప్పుకుపోయే రోజులివి. అలాంటిది ఎప్పుడో పాతికేళ్ల క్రితం సాయం చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలపడం కోసం ఓ యువతి చేసిన ప్రయత్నం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పేరు, ఊరు లాంటి వివరాలు ఏం తెలియని వ్యక్తి కోసం కేవలం ఓ ఫోటో సాయంతో గాలించడం అంటే మాటలు కాదు. కానీ లండన్‌కు చెందిన ఒక యువతి చిన్నప్పుడు తనకు ఆడుకోడానికి సైకిల్‌ కొనిచ్చి ఆనందానికి గురిచేసిన వ్యక్తిని కలుసుకునే ప్రయత్నం చేసి విజయం సాధించింది.

వివరాల్లోకి వెళ్తే.. మెవాన్‌ బబ్బకర్‌ (29) ప్రస్తుతం లండన్‌లో నివసిస్తోంది. కుర్దిష్‌కు చెందిన మెవాన్‌ కుటుంబం 1990  కాలంలో ఇరాక్‌ వదిలి నెదర్లాండ్‌లోని ఒక శరణార్థి శిబిరానికి చేరి అక్కడ తలదాచుకున్నారు. అప్పుడు మెవాన్‌ వయసు ఐదేళ్లు. ఆ సమయంలో అక్కడ శిబిరం వద్ద పని చేసే ఒక వ్యక్తి తనకు చిన్న సైకిల్‌ కొనిచ్చి ఎంతో ఆనందానికి గురి చేశారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి లండన్‌కు వెళ్లి పోయారు. 24ఏళ్ల తర్వాత మెవాన్‌ తనకు చిన్నతనంలో సైకిల్‌ కొనిపించిన వ్యక్తిని కలవాలని భావించింది. కానీ అతడి పేరు కూడా ఆమెకు తెలియదు. కేవలం చిన్నతనంలో ఆ వ్యక్తితో దిగిన ఫొటో మాత్రమే ఆమె దగ్గర ఉంది.

ఈ క్రమంలో మేవాన్‌ ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘నాకు ఐదేళ్ల వయసు ఉన్నపుడు మా కుటుంబం నెదర్లాండ్‌లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్నాం. ఆ సమయంలో జ్వోల్లే ప్రాంతంలో పనిచేసే ఒక వ్యక్తి నాకు సైకిల్‌ కొనిచ్చి ఆనందపరిచాడు. ఆ వ్యక్తి పేరు నాకు తెలియదు. నేను అతడిని కలుసుకోవాలనుకుంటున్నాను. సాయం చేయండి’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఇలా ట్వీట్‌ చేసిన కొద్ది గంటల్లోనే మేవాన్‌ ట్వీట్‌ను 7వేల సార్లు రీట్వీట్‌ చేశారు నెటిజన్లు.
 

అతడిని కనుగొనడంలో ఆ ట్వీట్‌ ఆమెకు ఎంతో ఉపయోగపడింది. తాజాగా మంగళవారం మేవాన్‌ అతడిని కలుసుకుంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోను ట్వీట్‌ చేసింది. ‘ఈ వ్యక్తి పేరు ఎగ్బర్ట్‌. 1990 నుంచి శరణార్థులకు సాయం చేస్తున్నారు. ఆయనను చూడగానే ఎంతో ఆనందం కలిగింది. నేను ఎంతో ధైర్యవంతమైన, స్వతంత్ర భావాలు గల మహిళగా ఎదిగినందుకు నన్ను చూసి ఎగ్బర్ట్‌ ఎంతో గర్వించారు. వారికి ఒక మంచి కుటుంబం ఉంది. ఇక నేను వారిని విడిచిపెట్టలేనని ఆ కుటుంబం భావిస్తుస్తోంది. చిన్న పనులు గొప్ప అనుభవాల్ని మిగిల్చాయి’ అంటూ మేవాన్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీ ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది.
 

మరిన్ని వార్తలు