వైరల్‌: దొంగలించాడు.. చిలిపిగా తప్పించుకున్నాడు! 

20 Aug, 2018 19:54 IST|Sakshi
కెమెరాలను చూసి నవ్వుతున్న పిక్‌పాకెటర్‌

ముంబై: సీసీ కెమెరాలతో నేరాలు తగ్గించవచ్చని, అందరూ తమ వీధుల్లో, వ్యాపార సంబంధిత షాపుల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకోని సహకరించాలని హైదరాబాద్‌ పోలీసులు ఎన్నో రోజులుగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము సైతం అనే కార్యక్రమం ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నారు. గత నెలలో ఓ వృద్ధురాలు రూ.30లక్షలు పోగట్టుకుంటే సీసీ కెమెరాల సాయంతోనే కేసు చేధించారు. అయితే తాజా వీడియో చూస్తే సీసీ కెమెరాలు లేని వారు వెంటనే ఏర్పాటు చేసుకుంటారు. అవును ముంబై పోలీసులు ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ వీడియో సీసీ కెమెరాల అవసరం ఏంటో మరోసారి తెలియజేసింది. ఇప్పటి వరకు నేరస్థులు గుర్తించడానికి ఉపయోగపడిన కెమెరాలు.. నేరాలు చేయకుండా కూడా ఉపయోగపడుతాయని ఈ వీడియోతో స్పష్టమైంది.

జన సమూహం ఉన్న షాపులో ఓ జేబు దొంగ పర్స్‌ను కొట్టేసి.. అక్కడి సీసీ కెమెరాలను చూసి భయంతో తిరిగిచ్చేసి చిలిపిగా తప్పించుకున్నాడు. సీసీ కెమెరాను చూసిన ఆ పిక్‌పాకెటర్‌ జంకుతూ దండం పెడుతూ మరీ ఆ పర్స్‌ ఆ వ్యక్తికి ఇచ్చేశాడు. ఈ వీడియోనే ప్రజల్లో సీసీ కెమెరాల అవగాహన కోసం ముంబై పోలీసులు‘ వీడియో ఫన్నీగా ఉంది. కానీ నిజంగా అయితే పరిణామాలు కాస్త సీరియస్‌గా ఉంటాయి’ అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లు సైతం జిఫ్‌ ఫైల్స్‌తో సమాధానమిస్తూ షేర్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు