పవన్‌ కల్యాణ్‌.. భగత్‌సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారా?

17 Dec, 2018 12:20 IST|Sakshi

సోషల్‌మీడియా వేదికగా నెటిజన్ల ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌ : భగత్ సింగ్.. మండే అగ్ని గోళం. జ్వలించే నిప్పుకణిక. రెపరెపలాడే విప్లవ పతాక. భగత్ సింగ్ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 23 ఏళ్ల వయసులోనే... దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి... ఉరికొయ్యను ముద్దాడిన ఈ స్వాతంత్ర్య సమరయోధుడు ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. డల్లాస్‌ వేదికగా జరిగిన జనసేన ప్రవాసగర్జనలో పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య సమరయోధులను ఉదహరిస్తూ భగత్‌ సింగ్‌ పేరును ప్రస్తావించారు.

భగత్‌ సింగ్‌ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను చదవాలని సూచించారు. అయితే భగత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకోలేదని, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్‌ వారిపై హింసాత్మక ఉద్యమం చేపట్టి.. వారి చేతిలో ఉరితీయబడ్డారని అందరికీ తెలిసిందే. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం పొరపాటుగా భగత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని కామెంట్‌ చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్‌ అజాద్‌ పేరు బదులు భగత్‌ సింగ్‌ పేరును పొరపాటుగా ప్రస్తావించారని ఆయన అభిమానులు సమర్ధించుకుంటున్నారు. బ్రిటీష్‌ పోలీసులు చుట్టుముట్టడంతో ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్నప్పుడు చేసిన శపథం నిజం చేస్తూ ఆజాద్‌ తన తుపాకీతో కాల్చుకుని వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు