కేరళ వరదలు: సెలబ్రిటీలపై నెటిజన్ల ఫైర్‌!

18 Aug, 2018 13:40 IST|Sakshi

హైదరాబాద్‌ : కేరళ వరదల నేపథ్యంలో ఆర్థిక సాయం ప్రకటించకుండా కేవలం ట్వీట్లతో సరిపెడుతున్న సెలబ్రిటీలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ చెత్రీలు, బాలీవుడ్‌ నటులు వివేక్‌ ఓబెరాయ్‌, అనుష్కశర్మ, అభిషేక్‌ బచ్చన్‌, అమితాబ్‌ బచ్చన్‌లు ఆర్థిక సాయం ప్రకటించకుండా కేవలం ట్వీట్లతో సరిపెట్టారు. తోచిన సాయం చేయాలని తమ అభిమానులకు సూచించారు.

అయితే వీరి కన్నా వారి అభిమానులే నయమని, తోచిన సాయం చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బట్టలు, నిత్యవసరాలు లేక ఆకలితో అలమటిస్తున్న కేరళ ప్రజలకు కావాల్సింది ట్వీట్స్‌ కావని, ఆర్థిక సాయం అని మండిపడుతున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన ట్వీట్‌కు బదులుగా ఓ నెటిజన్‌ బాధ్యతాయుతంగా ట్వీట్‌ చేయాలని సూచించారు. మరొకరైతే.. ‘వరదలతో కమ్యూనికేషన్‌ దెబ్బతిన్న కేరళలో మీ ట్వీట్స్‌ చదివే పరిస్థితి కూడా లేదు. దయచేసి ట్వీట్స్‌ కాకుండా విరాళాలు ప్రకటించండి’ అంటూ చురకలు అంటించారు.

ఇక అమితాబ్‌ ట్వీట్‌కు సెటైరిక్‌గా.. ‘నేను పేదవాడిని కాబట్టి సాయం చేయలేను.. నల్లధనం సంపాదించిన పెద్దలు సాయం చేయవచ్చని’ ఘాటుగా బదులిచ్చాడు. ‘మేం చేశాం.. మీరు చేసే సాయం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నా’ అని అభిషేక్‌ బచ్చన్‌ను ఒకరు ప్రశ్నించారు. ఇక దక్షిణాది సినీ హీరోలు, క్రీడాకారులే ఇప్పటి వరకు ఆర్థిక సాయం ప్రకటించారు. 

>
మరిన్ని వార్తలు