అదే నోటితో.. మటన్‌, బీఫ్‌ కూడా..

19 Jul, 2019 19:04 IST|Sakshi

న్యూఢిల్లీ : చికెన్, గుడ్లను కూడా శాకాహార జాబితాలో చేర్చాలని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ రాజ్యసభలో లేవనెత్తిన వింతవాదనపై ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. ఆయుర్వేదంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా సంజయ్‌ రౌత్‌ ఈ వింత వాదనను వినిపిస్తూ... చికెన్ శాఖాహారమో, మాంసాహారమో ఆయుష్ మంత్రిత్వ శాఖ తేల్చాలన్నారు. తాను నందుర్బర్ ప్రాంతంలోని ఓ కుగ్రామానికి వెళ్లినప్పుడు, అక్కడి ఆదివాసీ ప్రజలు తనకు భోజనాన్ని వడ్డించారని, అదేంటని వారిని అడగ్గా ‘ఆయుర్వేదిక్ చికెన్’ అని చెప్పినట్లు ఆయన సభలో గుర్తుచేసుకున్నారు.

దాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలన్ని నయమవుతాయని ఆదివాసీలు తనతో చెప్పారన్నారు. మీరట్‌కు చెందిన చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ ఆయుర్వేదిక్ ఎగ్స్‌పై పరిశోధన చేస్తున్నట్లు సంజయ్ ప్రస్తావించారు. సభలో ఆయన చేసిన ఈ తరహా వ్యాఖ్యలపై సభ్యులంతా విస్మయానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్‌ చేస్తుండగా.. నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘అయ్యా..అదే చేత్తో మటన్‌, బీఫ్‌ కూడా శాకాహార జాబితాలో చేర్చి పుణ్యం కట్టుకోరాదు’ అని ఒకరు.. ‘కేవలం చికెన్‌,గుడ్డేనా, మటన్‌, బీఫ్‌ ఏ పాపం చేశాయి’ అని మరొకరు.. మటన్‌ బీఫ్‌పై ఇంత వివక్షా? అని ఇంకొకరు ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు