పాప్‌కార్న్‌ అమ్ముతూ.. అద్భుతాన్ని సృష్టించాడు

8 Apr, 2019 19:44 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : జీవితంలో ప్రతి ఒక్కరం కలలు కంటాం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ కలల్ని సాకారం చేసుకుంటారు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఎన్ని ఆటంకాలు వచ్చినా గమ్యాన్ని చేరడం మాత్రం మర్చిపోరు. ఈ కోవకే చెందుతారు పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్‌ ఫయాజ్‌. సొంతంగా విమానం తయారు చేసుకుని విహరించాలనేది అతని కల. ప్రస్తుతం దాన్ని నిజం చేసుకోవడమే కాక కలల విమానంలో విహారం చేసేందుకు కావాల్సిన అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు. మహ్మద్‌ ఫయాజ్‌ చిన్నప్పుడు ఆకాశంలో విమానం ఎగరడం చూసి.. తాను కూడా సొంత విమానంలో ప్రయాణం చేయాలని కలలు కన్నాడు. అయితే సొంతంగా విమానం కాదు కదా.. విమానాశ్రయానికి వెళ్లి దగ్గర నుంచి విమానాన్ని కూడా చూడలేని పరిస్థితి.

బాగా చదివి డబ్బు సంపాదించి  ఆ కలను నెరవేర్చుకుందామనుకున్నాడు. కానీ ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్టా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అయితే ఇవేవి అతన్ని గమ్యాన్ని చేరకుండా ఆపలేకపోయాయ్‌. తన కలను సాకారం చేసుకోవాడానికి కావాల్సిన డబ్బు సంపాదించడం కోసం పగలంతా పాప్‌కార్న్‌ అమ్ముతూ.. రాత్రుళ్లు వాచ్‌మ్యాన్‌గా పనిశాడు. దీని గురించి అతడు మాట్లాడుతూ.. ‘ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసినప్పుడల్లా నేను కూడా నా సొంత విమానంలో చక్కర్లు కొట్టాలని అనుకునే వాడిని. ఇందుకు నా దగ్గర చదువు, డబ్బు లేదు. కానీ దేవుడిచ్చిన తెలివితేటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. వాటితో నా కలను సాకారం చేసుకోవాలని భావించాను. ఇందుకోసం ఒక సంవత్సరం పాటు కష్టపడ్డాను’ అని తెలిపారు.

‘అయితే విమానం తయారు చేయడానికి కావాల్సిన కనీస పరిజ్ఞానం గురించి నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానెల్‌లో ప్రసారం అయ్యే ఎయిర్‌ క్రాష్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యక్రమాన్ని చూస్తూ ఉండే వాడిని. ఈ కార్యక్రమం ద్వారా విమానాల్లో ఉండే వేర్వేరు విభాగాలు ఏంటి.. అవి ఎలా పనిచేస్తున్నాయి అనే అంశాల గురించి తెలుసుకున్నాను. అంతేకాక కొన్ని రోజుల క్రితం ఒక పాకిస్తాన్‌ అంతర్జాతీయ విమానాన్ని బహిరంగ ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శన ముగిసే వరకూ ప్రతి రోజు వెళ్లి ఆ విమానాన్ని పరిశీలిస్తుండే వాడిని. వీటన్నింటి పరిజ్ఞానంతో నా సొంతంగా విమానాన్ని రూపొందించాను. ఈ విమానాన్ని తయారు చేసేందుకు నాకు 90 వేల పాకిస్తాన్‌ రూపాయలు(మన కరెన్సీలో రూ. 44, 127) ఖర్చయ్యింది. ఇంత సొమ్ము సమకూర్చుకోవడం కోసం నాకున్న కొద్ది పాటి భూమిని కూడా అమ్మేశాను. చివరకు నా కలను నిజం చేసుకున్నాను’ అని తెలిపారు. 

‘నా కల సాకారం అయ్యింది. ఒక వ్యక్తి కూర్చునేందుకు వీలుగా రూపొందించిన ఈ విమానాన్ని గత నెల 23న పరిక్షించాను. అయితే అనుమతి లేకుండా ఇలా పరిక్షించడం నేరమని పోలీసులు నన్ను అరెస్ట్‌ చేశారు. ఇందుకోసం దేశ విమానాయన శాఖతో పాటు ఇతర ఏజెన్సీల నుంచి కూడా పర్మిషన్‌ తీసుకోవాలని తెలిపారు’ అన్నాడు. ఇతని స్టోరి కాస్తా ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేయడంతో దేశ వ్యాప్తంగా నెటిజన్లు ఇతనికి మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి సృజనాత్మకత ఆలోచనలు ఉన్న వ్యక్తులను అభినందిచాలి తప్ప ఇలా అరెస్ట్‌ చేయడం నేరం అని ట్రోల్‌ చేస్తున్నారు.

మహ్మద్‌కు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటంతో పాక్‌ ప్రభుత్వం దిగి వచ్చింది. మిని ఏరోప్లేన్‌ తయారు చేసిన మహ్మద్‌కు అభినందనలు తెలపడమే కాక ఈ రంగంలో మరింత అనుభవం గడించేందుకు అతనికి కావాల్సిన సాయం చేస్తానని హామీ ఇచ్చింది.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా