25 Dec, 2018 11:13 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే మధురమైన వేడుక. అందుకే చాలా మంది తమ స్థాయికి మించి.. భారీగా ఖర్చు చేసి మరీ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ధనవంతుల ఇళ్లలో అయితే ఈ వేడుకలు ఎంత అట్టహాసంగా జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో జరిగిన దీప్‌వీర్‌, ప్రియాంక - నిక్‌ జోనాస్‌ల వివాహం, ఇషా అంబానీ పెళ్లి వేడుక ఎంత వైభవంగా జరిగిందో తెలిసిన సంగతే. అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకలకు.. భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ఇషా అంబానీ పెళ్లికయితే ఏకంగా రూ. 700 కోట్లు ఖర్చు చేశారనే వార్తలు వినిపించాయి.

లక్షల్లో ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటున్న నేటి రోజుల్లో కేవలం రూ.10 వేలతో చాలా సాదా సీదాగా పెళ్లి చేసుకున్నాడో యువకుడు. దాంతో సెలబ్రెటీల పెళ్లి వేడుకల కంటే ఎక్కువగా ఇతని పెళ్లి ముచ్చట్లే తెగ వైరలవుతున్నాయిప్పుడు. వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన రిజ్వాన్‌ పెహెల్వాన్‌ తన పెళ్లి వేడుకను చాలా అంటే చాలా సింపుల్‌గా జరుపుకున్నాడు.ఇతని బంధువుల లిస్ట్‌లో ఉన్నది కేవలం 25 మంది మాత్రమే. వారు కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులు. ఇక వివాహ వేదికగా తన ఇంటి మేడను ఎంచుకున్నాడు. మెను విషయానికోస్తే చికెన్‌ టిక్కా, సీక్‌ కబాబ్‌, స్ట్రాబెర్రిస్‌, ఐస్‌క్రీమ్‌ అంతే.

తన పెళ్లి వేడుకల గురించి రిజ్వాన్‌ ‘వంట విషయానికోస్తే.. వంటవ్యక్తిని నా స్నేహితుడు పంపించాడు. ఇక నా దగ్గర ఉన్న డబ్బులోంచి చికెన్‌, మసాలా కొనుగోలు చేశాను. ఇక నా భార్య స్టార్టర్‌గా ఖట్టే ఆలు తయారు చేసింది. ఇక మా నాన్న మేడ మీద అందమైన దీపాలను ఏర్పాటు చేశారు. ఇక పక్కనే ఉన్న ఆఫీస్‌ నుంచి 25 చైర్లను, టేబుల్‌ను తీసుకొచ్చాను. డిసర్ట్‌ తయారు చేయడం మరిచిపోయాను అందుకే స్ట్రాబెర్రీస్‌, ఐస్‌క్రీం తీసుకొచ్చాను. ఇక నేను, నా భార్య బ్లూ కలర్‌ సల్వాజ్‌ కమీజ్‌ వేసుకున్నాం. వీటిని మా అమ్మ, సోదరి మా పెళ్లి కానుకగా ఇచ్చార’ని తెలిపాడు.

‘ఇక అందరం తిని.. అర్థరాత్రి వరకూ కబుర్లు చెప్పుకుంటూ గడిపాము. ఇలా చాలా సింపుల్‌గా ఎంతో సంతోషంగా నా పెళ్లి తంతు పూర్తయ్యింది. పెళ్లి సింపుల్‌గా జరిగిందా.. గ్రాండ్‌గా జరిగింది అన్నది ముఖ్యం కాదు. జీవితాంతం సంతోషంగా కలిసి ఉండటం ముఖ్యం’ అంటూ ట్విటర్‌ ద్వారా తన పెళ్లి ముచ్చట్లు షేర్‌ చేశారు రిజ్వాన్‌. ప్రస్తుతం ఈ సింపుల్‌ షాదీ కహానీ తెగ వైరల్‌ అవుతోంది.. రిజ్వాన్‌ ఆలోచనను మెచ్చుకుంటూ అతనికి అభినందనలు తెలపుతున్నారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు