‘ఆ ఫోటో ఇంత పని చేస్తుందని అనుకోలేదు’

11 Jun, 2020 14:02 IST|Sakshi
ఫోన్లను క్రాష్‌ చేస్తోన్న వాల్‌పేపర్‌

ఓ వాల్‌పేపర్ వల్ల ఆండ్రాయిడ్ ఫోన్లు క్రాష్ అవుతుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోను వాల్‌పేపర్‌గా పెట్టుకుంటే.. తమ మొబైల్స్ స్క్రీన్‌లాక్ దానంతటదే ఆన్ అవడం, వెంటనే ఆఫ్ అవడం జరుగుతోందని ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులు ఫిర్యాదు చేశారు. మోంటానాలోని హిమానీనద జాతీయ ఉద్యానవనంలోని సెయింట్ మేరీ సరస్సు ఫోటో ఇది. ఈ క్రమంలో ఈ ఫోటో తీసిన వ్యక్తి ప్రస్తుతం తెర మీదకు వచ్చారు. గౌరవ్ అగర్వాల్‌ అనే శాస్త్రవేత్త, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ 2009, ఆగస్టులో దీనిని తీశారు. ఫోటో షేరింగ్‌ సైట్‌ ‘ఫ్లికర్’‌లో అప్‌లోడ్‌ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఫోటోను వాల్‌పేపర్‌గా వాడిన ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాటంతట అవే ఆన్‌, ఆఫ్‌ కావడం.. క్రాష్‌ అవ్వడం జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అగర్వాల్‌ ఈ ఫోటో, దాని వెనక ఉన్న కథను తెలియజేశారు. ఈ సందర్భంగా అగర్వాల్‌‌ మాట్లాడుతూ.. ‘ఎవరి ఫోన్‌ పాడు చేయాలనే ఉద్దేశంతో ఈ ఫోటో తీయలేదు. ఈ ఫోటో వల్ల ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగేవరకు నాకు దీని గురించి తెలియదు. నికాన్‌ కెమెరాతో ఈ ఫోటో తీశాను. తరువాత 'లైట్‌రూమ్' అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి దాన్ని ఎడిట్ చేశాను. అయితే ఫోటోను ఎక్స్‌ప్లోర్‌ చేయడానికి నేను ఎంచుకున్న కలర్ మోడ్.. ఇప్పటి ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అనుకూలంగా లేదు’ అని తెలిపాడు.

అంతేకాక ‘ఇక ఇప్పటి నుంచి నేను మరొక ఫార్మాట్ ఉపయోగించబోతున్నాను. ఈ ఫోటోలో ఏమీ తప్పు లేదు, కాని ఇది ఎల్ఆర్ నుండి ప్రోఫోటోఆర్‌జీబీ ఫార్మాట్‌లో ఎక్స్‌ప్లోర్‌ చేశాను. అందుకే ఈ ఫోటో ఆండ్రాయిడ్ ఫోన్‌కు అనుకూలంగా లేదు’ అని అగర్వాల్ అన్నారు. ఈ వాల్‌ పేపర్‌ సమస్య పెద్దది కావడంతో ఈ నెల 11న దీనికి సంబంధించి ఓ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు సామ్‌సంగ్‌ ప్రకటించింది. దీనిపై ఓ నిపుణుడు మాట్లాడుతూ.. సదరు ఫొటో ఆర్‌జీబీ(RGB) కలర్ ఫార్మాట్‌లో ఉందని, ఆండ్రాయిడ్ ప్రఫర్డ్ ఎస్‌ఆర్‌జీ‌బీలో లేకపోవడం వల్లే ఇలా జరుగుతుండొచ్చని చెప్పారు

మరిన్ని వార్తలు