పికాసో కాదు..  పిగ్‌కాసో! 

11 Feb, 2018 02:28 IST|Sakshi

చిత్ర కళలో పేరొందిన కళాకారుడు పికాసో.. ఆయన తర్వాత నేనేనంటూ చిటికెలో చిత్రాలు గీస్తోంది ఈ పిగ్‌కాసో. ఎవరీ పిగ్‌కాసో అనుకుంటున్నారా! పక్క చిత్రంలో కనిపిస్తున్న పందిగారే.. దక్షిణాఫ్రికాలో ఓ కబేళాకు తరలిస్తున్న నాలుగు వారాల పందిపిల్లను కాపాడి దత్తత తీసుకుంది జంతు హక్కుల సామాజిక కార్యకర్త జొన్నె లెఫ్సోన్‌. అప్పటి నుంచి దాన్ని వ్యవసాయ క్షేత్రానికి తరలించి పెంచుకోసాగింది. ఓ రోజు పంది ఆడుకోవడానికి వెరైటీ బొమ్మలను దాని ముందు పడవేసింది. అది మాత్రం తనకు నచ్చిన పెయింటింగ్‌ బ్రష్‌ను ఎంచుకుంది. ఇది గమనించిన లెఫ్సోన్‌ దాని ముందు కెన్వాస్‌ అమర్చి రంగుల్ని అందుబాటులో ఉంచింది.

ఇంకేముంది నోట్లో బ్రష్‌ పట్టుకొని రంగుల్లో ముంచుతూ బొమ్మలు గీయడం ప్రారంభించింది. అప్పటినుంచి పిగ్‌ కాస్తా పిగ్‌కాసోగా మారింది. ఇప్పటికే ఎన్నో చిత్రాలను గీసింది. అన్నట్టు చెప్పడం మరిచానండోయ్‌.. పిగ్‌కాసో కళాఖండాలకు మంచి డిమాండ్‌ కూడా ఉంది. ఒక్కో చిత్రం దాదాపు 2 వేల డాలర్లకు అమ్ముడవుతోంది. పిగ్‌కాసో గురించి లెఫ్సోన్‌ను ప్రశ్నిస్తే.. అది చాలా తెలివైందని, అసాధారణ ప్రతిభ గలదని ప్రశంసించింది. చిత్రాలు గీయాలనుకున్నప్పుడే గీస్తుందని.. బొమ్మలు గీయాలని ఏనాడూ బలవంతపెట్టలేదని చెప్పింది.  

మరిన్ని వార్తలు