అలా చేస్తే రూ.22 వేల చలానా తప్పించుకోవచ్చు..!

20 Sep, 2019 19:12 IST|Sakshi

న్యూఢిల్లీ : నూతన మోటారు వాహన చట్టం అమల్లోకి రావడంతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు పడుతున్నాయి. చలానా మొత్తాలు ఏకంగా 10 రెట్లు పెరిగాయి. గతంలో లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా విధించగా.. ఇప్పుడది రూ.5000లకు చేరింది. ఇక ఈ చట్టంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాహనం ఖరీదు కంటే చలానా మొత్తమే ఎక్కువగా ఉన్న ఉదంతాలూ వెలుగుచూశాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు యథాతదంగా నూతన మోటారు వాహన చట్టాన్ని అమలు చేస్తుండగా.. కొన్ని రాష్ట్రాలు జరిమానా మొత్తాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

ఇదిలాఉండగా.. పంజాబ్‌కు చెందిన సునీల్‌ సంధూ అనే పోలీసు సోషల్‌ మీడియా వేదికగా వాహనదారులకు భారీ ఊరట కలిగించే ప్రయత్నం చేశాడు. అన్ని పత్రాలు ఉండి కూడా కొందరు జరిమానాలు చెల్లిస్తున్నారని.. అలాంటి వారు కొంచెం ఓపిగ్గా వ్యవహరిస్తే దాదాపు రూ.22 వేల చలానా నుంచి బయటపడొచ్చని తెలిపాడు. ‘లైసెన్స్‌ లేకుండా ట్రాఫిక్‌ సిబ్బందికి చిక్కితే రూ.5 వేలు ఫైన్‌ చెల్లించాలి. దాంతోపాటు బండి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ లేకుంటే రూ.5 వేలు, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుంటే రూ.10 వేలు, ఇన్సూరెన్స్‌ లేకపోతే రూ.2 వేలు చెల్లించాల్సి వస్తుంది. అంటే మొత్తం అక్షరాల రూ.22 వేలు జరిమానా చెల్లించాలి.

వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ.. వాటిని ట్రాఫిక్‌ సిబ్బందికి సమర్పించకపోతే భారీ చలానాలు తప్పవు. అటువంటి సందర్భాల్లో కాస్త సహనం ప్రదర్శించాలి. చలానా మొత్తం చెల్లించడానికి వాహనదారుడికి 15 రోజుల గడువు ఉంటుంది. ఆ సమయంలో కాస్త కష్టమైనా ఫరవాలేదు. ఓపికతో వాహనం పత్రాలన్నీ సంబంధిత అధికారులకు సమర్పిస్తే సరి. విధించిన చలానాలను రద్దు చేస్తారు. నామమాత్రంగా కేవలం రూ.100 మాత్రమే జరిమానాగా విధిస్తారు’ అని సునీల్‌ సంధూ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో వైరల్‌ అయింది.

>
మరిన్ని వార్తలు