ఈ ప్రశ్నకు బదులేది?

18 Feb, 2019 04:41 IST|Sakshi

డిజిటల్‌ వారసత్వం

ఫేస్‌బుక్, ట్విట్టర్,ఇన్‌స్టాగ్రామ్‌ 

‘డెడ్‌’ అకౌంట్లపై కొత్తచర్చ

వివిధ దేశాల్లో రకరకాల చట్టాలు..

తుడిచేయడమే మేలంటున్న న్యాయనిపుణులు  

బ్రిటన్‌లో ఒక అమ్మాయి రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం తల్లిదండ్రుల్ని కలిచివేసింది. అమ్మాయి సెల్‌ఫోన్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ పరిశీలిస్తే ఆత్మహత్యకు కారణాలేమైనా తెలుస్తాయేమోనని వారు ప్రయత్నించారు. అయితే, పాస్‌వర్డ్‌ తెలియకపోవడంతో అవేవీ ఓపెన్‌ కాలేదు. కంపెనీ వాళ్లని సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. అమ్మాయి చనిపోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఆమెకు సంబంధించిన అకౌంట్లు, వాటిలోని సమాచారం ఎవరికీ తెలియకుండా నిక్షిప్తమైపోయిం ది.

దాంతో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారెవరైనా చనిపోతే ఆ ఖాతాలన్నీ ఏమైపోవాలి. ఆ సమాచారం ఎవరికి చెందాలి. డిజిటల్‌ వారసులెవరు.. అన్న ప్రశ్నలు ఉదయించాయి. అయితే దీనికి ఇంత వరకు సరైన సమాధానం లభించలేదు. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు సామాజిక మాధ్యమ ఖాతా కలిగి ఉన్నారని ఒక అంచనా. ఆయా ఖాతాల్లో ఎన్నో ఫొటోలు, వ్యక్తిగత విషయాలు, సందేశాలు పోస్టు చేస్తుం టారు. ఒక రకంగా అది వారి వ్యక్తిగత సమాచార నిధిలా తయారవుతుంది. ఒకవేళ ఆ ఖాతాదారు మరణిస్తే ఆ నిధి ఎవరికి చెందు తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. చనిపోయిన వారి ఫోన్‌ డేటా అంతా వారి తల్లిదండ్రుల ఆస్తి కావాలని, ఆ సమాచారం అంతా వారికి చెందాలని కొందరు వాదిస్తున్నారు. 

సరైన చట్టాలు లేవు
ఒకరి ఖాతాను (చనిపోయినవారి) మరొకరు ఓపెన్‌ చేయడం తమ విధానాలకు విరుద్ధమని ఇన్‌స్టాగ్రామ్‌ అంటోంది. అయితే, కోర్టు ఆదేశాలున్న పక్షంలో తల్లిదండ్రులకు ఆ సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చే విషయం పరిశీలిస్తామంటోంది. సామాజిక మాధ్యమాల ఖాతాల వారసత్వంపై చాలా దేశాల్లో ఎలాంటి చట్టాలు, నిబంధనల్లేవు. దాంతో ఏ ఖాతాదారుడైనా చనిపోతే అతని అకౌంట్‌లోని సమాచారం ఎవరికి చెందాలన్నది సమస్యగా మారుతోంది. ‘సామాజిక మాధ్యమాల్ని వాడే వారిలో చాలా మంది వ్యక్తిగత రహస్యాలను, సమాచారాన్ని ఇతరులకు పంపుతుంటారు. వ్యక్తిగత గోప్యత అన్నది చాలా కీలకం. ప్రస్తుతం ఉన్న చట్టాలేవీ దీనిని అతిక్రమించలేవు’అంటున్నారు బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎడినా హర్బింజా.

ఏ దేశంలో ఎలా... 
డిజిటల్‌ వారసత్వానికి సంబంధించి ఐరోపా యూనియన్‌ గత ఏడాది ‘జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ (జీడీపీఆర్‌) పేరుతో ఒక చట్టాన్ని తెచ్చింది. తమకు సంబంధించిన డేటా కాపీని ఇవ్వాల్సిందిగా లేదా తమ డేటాను తొలగించాల్సిందిగా ఇంటర్‌నెట్‌ కంపెనీలను కోరే హక్కు ఖాతాదారులకు ఉంటుందని ఈ చట్టం చెబుతోంది. అయితే బతికున్న వారికే ఇది వర్తిస్తుంది.  
వ్యక్తిగత సమాచారం ఆస్తి కాదని, దానిని అమ్మడమో, ఇతరులకు బదలాయించడమో సాధ్యం కాదని ఐరోపా న్యాయ నిపుణులు అంటున్నారు. 
ఫ్రాన్స్‌లో తమ తదనంతరం తమ సోషల్‌ మీడియా డేటాను ఏం చెయ్యాలన్నది కంపెనీలకు చెప్పే హక్కు ప్రజలకు ఉంది. కెనడాలో అయితే, మృతుల ఖాతాను వారి వారసులు తెరవచ్చు. 
సామాజిక ఖాతాల సమాచారాన్ని కూడా ఉత్తరాల్లాగే పరిగణించి వాటిపై వారసులకు హక్కు కల్పించాలని జర్మనీ కోర్టు గత ఏడాది çస్పష్టం చేసింది. దాంతో అక్కడ మృతుల కుటుంబీకులు ఆ సమాచారాన్ని పొందే అవకాశం ఉంది. ఇక అమెరికా విషయానికి వస్తే.. మృతులు సామాజిక మాధ్యమాల్లో ఎవరితో, ఎప్పుడు మాట్లాడారన్నది ‘చూడవచ్చు’. దాన్ని చదవాలంటే మాత్రం కోర్టు లేదా ఖాతాదారుడి అనుమతి కావాలి. 

మాధ్యమాలేమంటున్నాయి..
మరణానంతరం తమ డిజిటల్‌ డేటాను ఎవరికి, ఎంత మేరకు ఇవ్వవచ్చన్నది నిర్ణయించుకునే అవకాశాన్ని గూగుల్‌ తమ ఖాతా దారులకు కల్పిస్తోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హోల్డర్ల విషయంలో మృతుల ఖాతాలను రద్దు చేయడం లేదా దాన్ని స్మారక పుట(మెమోరియల్‌ పేజ్‌)గా మార్చడానికి కుటుంబీకులకు అవకాశం కల్పిస్తోంది. స్మారక పుటల్లో సమాచారం కనిపిస్తుంది కాని దాన్ని మార్చడానికి వీలు కాదు. ఫేస్‌బుక్‌ ఖాతాదారులు తమ ఖాతాలకు వారసులను కూడా నామినేట్‌ చేసుకోవచ్చు. ఒక అకౌంట్‌ డిలీట్‌ చేసినా దాంట్లోని సమాచారాన్ని కొంతకాలంపాటు పదిలంగా ఉంచుతామని ఈ మాధ్యమాలు చెబుతున్నాయి. 

నిపుణుల సూచనలు
మృతుని డేటాను ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, ఖాతాదారుడు చనిపోగానే అతని డేటా అంతా దానికదే తుడిచిపెట్టుకుపోయేలా చూడాలని న్యాయ నిపుణులు అంటున్నారు. మృతుని అకౌంట్‌లో వ్యక్తిగత సమా చారాన్ని డిలీట్‌ చేయాలని, ఫొటోలు, ఇతర సమాచారంపై వారసులకు హక్కు కల్పించాలని మరికొందరంటున్నారు.  

మరిన్ని వార్తలు