అధికారి కొంప ముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌

27 Aug, 2019 14:41 IST|Sakshi

జైపూర్‌: నేటి కాలంలో వివాహ వేడుక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన అందమైన జ్ఞాపకం కావడంతో పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చాలా సర్వ సాధరణమయ్యింది. ఉన్నత కుటుంబాల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం భిన్నమైన పద్దతులను అనుసరిస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఓ అధికారి పాలిట సమస్యగా పరిణమించింది. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో భాగంగా కాబోయే భార్య దగ్గర నుంచి లంచం తీసుకుంటున్నట్లు తీసిన వీడియో కాస్తా ఓ పోలీసు అధికారి కొంపముంచింది.

ఆ వివరాలు.. ఓ పోలీసు అధికారికి వివాహం నిశ్చయమయ్యింది. వేడుకలో భాగంగా కాబోయే భార్యతో కలిసి ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో పాల్గొన్నాడు. పోలీసు కదా అందుకే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం ఓ భిన్నమైన కాన్సెప్ట్‌ను ఎన్నుకున్నాడు. దానిలో భాగంగా.. సదరు అధికారి హెల్మెట్‌ పెట్టుకోలేదనే కారణంతో తనకు కాబోయే భార్యను ఆపుతాడు. హెల్మెట్‌ లేదు.. ఫైన్‌ కట్టాలని చెప్తాడు. అప్పుడామే తనకు కాబోయే భర్త, సదరు అధికారి జేబులో కొంత డబ్బు పెట్టి వెళ్లిపోతుంది. అలా వెళ్తూ తన భర్త జేబులో నుంచి వాలెట్‌ కొట్టేస్తుంది. ఇది గమనించిన అధికారి తన వాలెట్‌ను తిరిగి తెచ్చుకోవడం కోసం ఆమెను కలుసుకుంటాడు. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ కాన్సెప్ట్‌తో తీసిన వీరి ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్నేహితులకు, బంధువులకు విపరీతంగా నచ్చింది. దాంతో యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. నెటిజనులకు కూడా ఈ వీడియో తెగ నచ్చింది.

అందరికి నచ్చిన ఈ వీడియో పోలీసు శాఖకు మాత్రం ఆగ్రహం తెప్పించింది. డిపార్ట్‌మెంట్‌ పరువు తీసేలా లంచం తీసుకుంటూ వీడియో తీయడమే కాక దాన్ని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసినందుకు సదరు అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల ఇవ్వడమే కాక తగిన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నారు. అసలు యూనిఫామ్‌ని ఇలా వ్యక్తిగత కార్యక్రమాల కోసం వినియోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక మీదట ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు