సానియా.. నీ వివరణలో పాకిస్తాన్‌ ఏది?

18 Feb, 2019 19:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పుల్వామా ఉగ్రదాడి అంశం భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను ఇప్పట్లో వదిలేలా లేదు. 40 మంది జవాన్ల వీరమరణంతో అట్టుడికిపోతున్న భారత ప్రజలు ఆ ఆగ్రహాన్ని సానియాపై ప్రదర్శిస్తున్నారు. దీంతో ఆమె సోషల్‌ మీడియా వేదికగా తన దేశభక్తిపై సుదీర్ఘ వివరణ ఇచ్చినా భారత నెటిజన్లు సంతృప్తి చెందడం లేదు. తనకు దేశభక్తి ఉందని గొంతు చించుకొని అరవాలా? అంటూ సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌తో సానియా ట్రోలర్స్‌పై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నెటిజన్లు ఆమె వివరణ పోస్ట్‌ను కూడా తప్పుబడుతూ కామెంట్‌ చేస్తున్నారు. ‘సానియా మేడమ్‌.. ఉగ్రవాదంపై మీరు చాలా అద్భుతంగా రాశారు. కానీ మీ వివరణలో పాకిస్తాన్‌ ప్రస్తావించడం మాత్రం మరిచిపోయారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌ గురించి ఎందుకు రాయలేదు మేడమ్‌’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘ఈ ఉగ్రదాడి వెనుక ఉన్న పాక్‌ గురించి మాట్లాడలేదు.. పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి ఎందుకు మద్దతు తెలుపుతోంది?’ అని మరొకరు ప్రశ్నించారు. ‘మేడమ్‌.. మీ వివరణలో పాక్‌ను ప్రస్తావించుంటే గొప్పగా ఉండేది. ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలో స్థానం లేదని చెప్పారు. కానీ మతం పేరిట ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ విషయాన్ని ఎందుకు మాట్లాడవు’ అని ఇంకొకరు నిలదీస్తున్నారు.  తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అయితే ఏకంగా పాకిస్తాన్‌ కోడలు తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అవసరమా? అని ప్రశ్నించారు. వెంటనే సానియాను తెలంగాణ ప్రచారకర్తగా తొలిగించాలని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. (చదవండి: గొంతు చించుకొని అరవాలా?)

ఇక సానియా ఇలా ట్రోల్స్‌ ఎదుర్కోవడం ఇది తొలిసారేం కాదు. పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను వివాహం చేసుకున్నప్పటి నుంచి ఆమెపై ఈ తరహా ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా భారత్‌-పాక్‌ మధ్య వివాదాలు చెలరేగినప్పుడు, ఇరు దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లున్నప్పడు సానియాపై ఈ తరహా ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంటుంది. గతేడాది జరిగిన ఆసియా కప్‌ సందర్భంగా కూడా ఆమె ట్రోలింగ్‌కు గురయ్యారు. దీంతో చేసేదేం లేక మ్యాచ్‌కు ముందు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటమే మేలని భావించి సైన్‌ ఔట్‌ అయ్యారు. ( చదవండి: పాక్‌ కోడలు అవసరమా?: రాజాసింగ్‌)

మరిన్ని వార్తలు