ఫిబ్రవరి 14 భారత్‌కు బ్లాక్‌డే : సానియా

17 Feb, 2019 19:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తనకు దేశభక్తి ఉందని గొంతు చించుకొని అరవాలా? అని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా అసహనం వ్యక్తం చేశారు.  పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌మాలిక్‌ను పెళ్లి చేసుకున్నందుకు ఆమెకు ఇబ్బందులు తప్పడం లేదు. భారత్‌-పాక్‌ మధ్య ఏ వివాదం చెలరేగినా భారత నెటిజన్లు సానియా మీర్జాను టార్గెట్‌ చేస్తూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. తాజాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కూడా ఆమెపై విపరీతంగా ట్రోలింగ్‌ జరిగింది. ఉగ్రదాడిని ఆలస్యంగా ఖండించినందుకు భారత నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోయారు. అంతే కాకుండా సానియా తన ఫొటో షూట్‌లను పోస్ట్‌ చేయడం.. వారి కోపానికి మరింత ఆజ్యం పోసింది. దీంతో నొటికొచ్చినట్లు కామెంట్‌ చేశారు. చివరకు ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్ట్‌ చేసినా వదల్లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆమె.. తన దేశభక్తి గురించి సోషల్‌ మీడియా వేదికగా వివరణ ఇస్తూ.. ట్రోలర్స్‌పై మండిపడింది.
 
‘ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెడితేనే సెలబ్రిటీలకు దేశభక్తి ఉందని భావించే వాళ్ల కోసమే ఈ పోస్ట్ పెడుతున్నా. మేం సెలబ్రిటీలం కాబట్టి.. కొందరు వ్యక్తులు మాపై పనిగట్టుకొని విద్వేషాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం వారే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని గొంతు చించుకొని అరవాల్సిన అవసరం మాకు లేదు. ప్రతీ ఒక్కరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తారు.  నేను నా దేశం కోసం ఆడుతాను, అందుకోసం నా చమట చిందిస్తాను. అలా నేను నా దేశానికి సేవ చేస్తున్నాను. సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు నేను అండగా నిలబడతాను. వాళ్లు ఈ దేశాన్ని కాపాడే నిజమైన హీరోలు. ఫిబ్రవరీ 14 మన దేశానికి బ్లాక్ డే. ఇలాంటి రోజు మరొకటి చూడొద్దని కోరుకుంటున్నా. ఈ రోజుని, జరిగిన ఘటనని అంత సులువుగా మర్చిపోలేము. కానీ ఇప్పటికీ ద్వేషం కంటే నేను శాంతిని కోరుకుంటున్నా. ఏదైన ఉపయోకరమైన విషయం జరగడం కోసం ఆగ్రహిస్తే.. అది మంచిది. ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలో స్థానం లేదు.. ఉండదు కూడా.  మీరు కూడా ఇంట్లో కూర్చొని సెలబ్రిటీలు ఎన్ని పోస్ట్‌లు చేశారు, ఏం పోస్ట్ చేశారో.. అని తీర్మానించడం మానేసి దేశానికి ఉపయోగేపడే పని చేయండి. దేశానికి మీ వొంతు సహాయం అందించండి.. మేం చేస్తున్నాం.. కానీ సోషల్‌మీడియాలో ప్రకటిస్తూ కాదు. అది సరైన పని’ అంటూ తన అసహనాన్ని వెల్లగక్కింది.

మరిన్ని వార్తలు