ఫోటో వైరల్‌.. బిడ్డతో కలిసి జూమ్‌ మీటింగ్‌కు హాజరైన మంత్రి

22 May, 2020 15:42 IST|Sakshi

ప్రిటౌన్‌: పిల్లల్ని కనడం, పెంచడం వంటి పనులన్ని ఆడవారివే అని భావించే తండ్రులు నేటికి కొకొల్లలు. ప్రస్తుతం దంపతులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండటంతో ఈ పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చింది. ఈ క్రమంలో సియెర్రా లియోన్‌కు చెందిన ఓ మంత్రి తండ్రులు నిర్వహించాల్సిన బాధ్యతల గురించి చాలా బాగా చెప్పి.. మరి కొందరు మగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వివరాలు.. సియెర్రా లియోన్‌ విద్యా శాఖమంత్రి డేవిడ్ మొయినినా సెంగే పది నెలల తన కుమార్తెకు పాలు తాగిస్తూ జూమ్‌ మీటింగ్‌కు హాజరయ్యాడు. పాలు పట్టడం పూర్తయ్యాక బిడ్డను వీపుకు కట్టుకున్నాడు. మీటింగ్‌ పూర్తయ్యేంతవరకూ బిడ్డను అలానే ఉంచుకున్నాడు. 

ఈ క్రమంలో బిడ్డను వీపుకు కట్టుకున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు డేవిడ్‌. అంతేకాక ‘ఇంటి నుంచి పని చేస్తున్నారా.. మీ లాస్ట్‌ జూమ్‌ కాల్‌కు మీరు ఎలా అటెండ్‌ అయ్యారు? నేను మాత్రం నా 10 నెలల బిడ్డకు పాలు పడుతూ మీటింగ్‌కు హాజరయ్యాను. తను పాలు తాగడం పూర్తయిన తర్వాత నా వీపుకు కట్టుకుని మిగతా మీటింగ్‌ పూర్తి చేశాను. ఈ ప్రజెంట్‌షన్‌ తనను నిద్ర పుచ్చింది. మీరు ఇంటి నుంచి ఎలా పని చేస్తున్నారో ప్రపంచానికి తెలపండి’ అంటూ ట్వీట్‌ చేశాడు డేవిడ్‌.

దీని గురించి బీబీసీ డేవిడ్‌ను ప్రశ్నించగా.. ‘పశ్చిమ ఆఫ్రికా దేశంలో ఓ తండ్రి పిల్లలను ఇలా వీపుకు కట్టుకోవడం అనేది చాలా అరుదు. ఓ తల్లి బిడ్డను వీపున మోసుకెళ్లడం ఇక్కడ సర్వసాధరణంగా కనిపించే అంశం. ఇదే పని నా భార్య చేస్తే.. ఆ ఫోటో ఇంత వైరల్‌ అయ్యేది కాదు. నా స్నేహితుల్లో చాలా మంది వారి పిల్లలకు కనీసం డైపర్‌ కూడా మార్చరు. అలాంటి వారిలో మార్పు తేవడం కోసమే నేను ఈ ఫోటోను షేర్‌ చేశాను ’అని తెలిపాడు.

మరిన్ని వార్తలు