అమరావతికి జగనే పర్మినెంట్‌.. బాబు అద్దెదారుడే

14 Mar, 2019 08:30 IST|Sakshi

‘అమరావతికి చంద్రబాబు టెనెంట్‌(అద్దెకుండేవారు)... అందుకే ఇక్కడ మరొకరి ఇంట్లో షెల్టర్‌ తీసుకున్నారు.. అమరావతికి జగనే పర్మినెంట్‌.... అందుకే సొంత ఇల్లు కట్టుకున్నారు’  సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న కామెంట్‌ ఇది. 
అంతేకాదు... 
‘చంద్రబాబూ ఇక్కడ ప్యాకప్‌ చెప్పు...హైదరాబాద్‌లో కట్టుకున్న బంగ్లాలో రెస్టాఫ్‌ లైఫ్‌ సెటిలవ్వు’ అని సలహా కూడా ఇస్తున్నారు. 
‘బాస్‌ జగన్‌ ఈజ్‌ కమింగ్‌...  బాబూ సైడ్‌ ప్లీజ్‌ ’అని టీజ్‌ చేస్తున్నారు. 

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఓటమి భయంతో తీవ్ర అసహనంతో ఉన్న చంద్రబాబు.. ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌పై చేస్తున్న అసత్య ఆరోపణలకు సోషల్‌ మీడియాలో కౌంటర్లు వెల్లువెత్తున్నాయి. ఇంతవరకూ తన అబద్ధాలను అనుకూల మీడియాలో పదే పదే ప్రచారం చేయించుకుంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించారు. ఇప్పుడూ అదే కుయుక్తితో చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఎంతో క్రియాశీలకంగా సోషల్‌ మీడియా మాత్రం అతని అసత్య ప్రచారాల బండారాన్ని బట్టబయలు చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారాలు ఎంత దిగజారుడు ఆరోపణల వివరాలతో సహా అనేకమంది సోషల్‌ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది.  

వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లోనే ఉంటున్నారని... ఏపీకి రావడం లేదని చంద్రబాబు ఇటీవల కాలంలో అసత్య ఆరోపణలకు దిగుతున్నారు. జగన్‌కు అధికారం ఇస్తే తెలంగాణలో ఉండే పరిపాలిస్తారని కూడా విమర్శించారు. దీనిపై సోషల్‌ మీడియాలో పలువురు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, జగన్‌లను సరిపోలుస్తూ టీడీపీ విమర్శలను బలంగా తిప్పికొట్టారు. ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు గత ఐదేళ్లలో అమరావతిలో సొంత ఇల్లు కూడా కట్టుకోలేదన్న విషయాన్ని సూటిగా ప్రశ్నించారు. 2014లో ఏపీకి సీఎం అయ్యాక చంద్రబాబు హైదరాబాద్‌లో విలాసవంతమైన బంగ్లా ఎందుకు కట్టుకున్నారని నిలదీస్తున్నారు. జగన్‌ అమరావతిలో సొంత ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కూడా చేసిన విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ ప్రశంసించారు. తాను అమరావతికి అద్దెకొచ్చానని, 2019లో హైదరాబాద్‌కు మారి అక్కడే శేష జీవితం గడపాల్సి ఉంటుందని తెలుసు కాబట్టే చంద్రబాబు ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోలేదంటూ సునిశిత విమర్శలు చేస్తున్నారు. జగన్‌కు తాను అమరావతిలో శాశ్వతంగా ఉండాల్సిందేనని తెలుసు కాబట్టే ఇక్కడే ఇల్లు కట్టుకున్నారని బాబు ఆరోపణల్ని తిప్పికొడుతున్నారు.  

గత 14 నెలలు రాష్ట్ర ప్రజల మధ్యే జగన్‌ : జగన్‌ హైదరాబాద్‌లోనే ఉంటున్నారన్న చంద్రబాబు విమర్శల్ని కూడా సోషల్‌ మీడియా తిప్పికొట్టింది. 2014 నుంచి ఏదో విధంగా ప్రజా ఉద్యమాలు, జిల్లాల పర్యటనలతో జగన్‌ దాదాపుగా పూర్తి సమయం ఏపీలోనే గడిపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాఫురం వరకు పాదయాత్ర నిర్వహించి 14 నెలల పాటు రాష్ట్ర  ప్రజలతోనే మమేకమైన తీరు మర్చిపోయావా? చంద్రబాబూ! అని నిలదీస్తున్నారు. అందుకే ఆయనకు అమరావతి నుంచి తట్టా బుట్టా సర్దుకోవాల్సిన సమయం వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. ‘బాస్‌ ఈజ్‌ కమింగ్‌... సైడ్‌ సైడ్‌ ప్లీజ్‌! చంద్రబాబూ’ అంటూ సోషల్‌ మీడియా ఇప్పుడు ఎలుగెత్తుతుంది.   

మరిన్ని వార్తలు