నిశ్శబ్ద విప్లవం!

24 Jun, 2018 03:47 IST|Sakshi

ఈ కాలంలో ఏది ఎప్పుడు వైరల్‌ అవుతుందో.. ఎందుకు అవుతుందో తెలియనే తెలియదు. కుర్రకారు ఇష్టాయిష్టాలు ఎప్పుడు, ఎలా మారతాయో కూడా అంత ఈజీగా అంచనా వేయలేం. వైరల్‌ అవడం అంటే ఏంటి.. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడం అంతేకదా! ఒక్కోసారి యూట్యూబ్‌లో పెట్టే వీడియోలకు క్షణాల్లో వీక్షకుల సంఖ్య కోట్లకు చేరుకుంటుంది. ఆ వీడియోలకు క్రేజ్‌ అలా ఉంటుంది మరి. సాధారణంగా పాటలు.. డ్యాన్స్‌ షోలు.. కామెడీ.. ఆట పట్టించే వీడియోలు, సమాచారం ఉన్న వీడియోలు.. ఇలా చాలా రకాల వీడియోలను యువత ఇష్టపడుతుంది. అయితే వీటన్నింటికీ భిన్నంగా దక్షిణ కొరియాకు చెందిన ఓ కుర్రాడు యూట్యూబ్‌లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాడు. మరోలా చెప్పాలంటే సంచలనం సృష్టిస్తున్నాడు.

ఇంతకీ ఆ పిల్లాడు ఆ వీడియోల్లో ఏం చేస్తున్నాడనే కదా మీ అనుమానం. చదువుకుంటున్నాడు.. అవును గంటల తరబడి సైలెంట్‌గా చదువుకుంటున్నాడు. తాను చదువుకునేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతున్నాడు. అంతే వేల మంది అతడి వీడియోలను తెగ చూసేస్తున్నారు. ఆ అబ్బాయి పేరు బోట్‌ నో జామ్‌. యూట్యూబ్‌లో తన చానెల్‌కు ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు దాదాపు 3.3 లక్షల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారట. తాను పోలీస్‌ అధికారి అయ్యేందుకు పరీక్షల కోసం సిద్ధం అవుతున్నానని చెబుతున్నాడు. ఇప్పుడు దక్షిణ కొరియాలో బోట్‌ ఒక సెన్సేషన్‌ అయ్యాడు. చూశారా.. సైలెంట్‌ కూడా ఎలా సెన్సేషన్‌ అయిపోతుందో.  

మరిన్ని వార్తలు