శశిథరూర్‌ స్పై ఆరోపణ.. జర్నలిస్ట్ రాజీనామా

14 Oct, 2017 14:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్ నేత శశిథరూర్‌కు గూఢాచర్యం చేసిందన్న ఆరోపణలు రావటంతో మనస్తాపం చెందిన ఓ పాత్రికేయురాలు రాజీనామా చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్‌ గోస్వామి ఛానెల్‌ రిపబ్లికన్‌ టీవీలో శ్వేతా కోఠారి సీనియర్‌ కరస్పాండెంట్‌గా విధులు నిర్వహించేవారు. ఈ క్రమంలో ఛానెల్ ను వీడుతున్నట్లు చెబుతూ తన ఫేస్‌ బుక్‌లో ఆమె ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. 

గూఢాచర్యం చేశానన్న ఆరోపణలు వాస్తవం కాదు. ఆ మచ్చ నేను భరించలేను. అందుకే ఛానెల్‌ వీడుతున్న అని ఆమె తెలిపారు. కాగా, శ్వేతా కోఠారి.. కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ కు తమ ఛానెల్‌లోని సమాచారం అందవేసిందన్న అనుమానంతో ఎడిటర్ ఆమెపై నిఘా పెట్టాడంట. ఆమె కదలికలను గమనించి తనకు సమాచారం చేరవేయాలని సిబ్బందికి సూచించాడంట. అంతేకాదు ఆమె ఆర్థిక పరిస్థితులపై కూడా ఆరాతీశాడని చెబుతున్నారు. ఈ విషయాలను ఓ సహోద్యోగి ద్వారా తెలుసుకున్న ఆమె.. ఆ ఆరోపణలను నిర్ధారించుకున్నాకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. 

అయితే సోషల్ మీడియాలో శశిథరూర్‌ను ఆమె ఫాలో కావటం.. పైగా శశిథరూర్‌కు సంబంధించి ఛేంజ్‌.ఓఆర్‌జీ పిటిషన్‌పై శ్వేత సంతకం చేయటంతోనే అర్నాబ్‌ ఆ నిర్ణయానికి వచ్చి ఉంటాడని భావిస్తున్నట్లు ఆమె అంటున్నారు. కాగా, సంస్థలో ఇలా వేధింపులు ఎదుర్కుంటున్న సిబ్బంది చాలా మందే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించటం గమనార్హం. ఇక శ్వేతా కొఠారి తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని శశిథరూర్‌ ట్విట్టర్ వేదికగా హర్షించారు. తనకు గూఢాచారులను నియమించుకోవాల్సిన అవసరం లేదన్న ఆయన.. నిజాయితీపరులైన పాత్రికేయులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు