డబ్బులుంటాయని భావించి దొంగతనం.. కానీ

10 Oct, 2019 09:06 IST|Sakshi

చాలా పెద్ద బ్యాగ్‌. భద్రంగా కారులో పెట్టి వెళ్లాడు యజమాని. దానిలో భారీ మొత్తంలో డబ్బు లేదా చాలా విలువైన వస్తువులు ఉంటాయని భావించారు దొంగలు. గప్‌చుప్‌గా బ్యాగ్‌ను దొంగతనం చేశారు. తీరా దాన్ని తెరిచి చూసి.. భయంతో పరుగందుకున్నారు. ఎందుకంటే విలువైన వస్తువులో, డబ్బులో ఉంటాయని భావించిన బ్యాగ్‌లో పాములుండటంతో ఆశ్చర్యంతో పాటు షాక్‌కు గురయ్యారు ఆ దొంగలు. వివరాలు.. బ్రియాన్‌ గుండే అనే వ్యక్తి పాములను పెంచి, వాటిని అమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ లైబ్రరీలో ఓ ప్రజెంటెషన్‌ ఇవ్వడానికి వెళ్లాడు గుండే. ఆ సమయంలో తనతో పాటు తీసుకువచ్చిన బ్యాగ్‌ను కారులోనే వదిలి వెళ్లాడు. దాంట్లో పదులు సంఖ్యలో పాములు ఉన్నాయి. గుండేను గమనించిన దొంగలు.. అతడు లైబ్రరీలోకి వెళ్లగానే ఆ బ్యాగ్‌ను తీసుకుని ఉడాయించారు.

ప్రజెంటేషన్‌ ముగించుకుని తిరిగి వచ్చిన గుండేకు కారులో పెట్టిన బ్యాగ్‌ కనిపించలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బ్యాగులో డబ్బులుంటాయిని భావించి ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారు.. కానీ అందులో పాములున్నాయని తెలిపాడు. దొంగతనం చేసిన వారు వాటిని జాగ్రత్తగా తీసుకువచ్చి తనకు అప్పగించాల్సిందిగా కోరాడు. ఇప్పటికే రెండు పాములు ఓ చెత్త బుట్ట వద్ద కనిపించాయని ఆందోళన వ్యక్తం చేశాడు గుండే. తన పాములను క్షేమంగా తిరిగి అప్పగించమని కోరాడు.

మరిన్ని వార్తలు