ఏంటా పని... చావును చేతిలో పట్టుకున్నావే!

31 Jan, 2019 17:04 IST|Sakshi

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వైరల్‌ వీడియో కోసమని ఇటీవలే ఓ వ్యక్తి క్రూయిజ్‌ షిప్‌లోని 11వ అంతస్తు నుంచి నీళ్లలో దూకిన సంగతి తెలిసిందే. అయితే అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడినప్పటికీ నెటిజన్ల చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. తాజాగా ఓ టూరిస్టు కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు.

దాని విషానికి విరుగుడు లేదు..
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఓ వ్యక్తి బీచ్‌లో సరదాగా నడుస్తూ అత్యంత విషపూరితమైన నీలం రంగు వలయాలు కలిగి ఉన్న ఆక్టోపస్‌(బ్లూ రింగ్డ్‌)ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత దానితో ఆటలాడుతూ టిక్‌ టాక్‌ వీడియో రూపొందించి.. ‘ఈ బుజ్జి ఆక్టోపస్‌’  ఎంత బాగుందో అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు టూరిస్టు తీరుపై మండిపడుతున్నారు. ‘ ఏంటా పని. అది విషపూరితమైన ఆక్టోపస్‌రా నాయనా.. దాని విషానికి విరుగుడు కూడా లేదు.. చావును చేతిలో పట్టుకోవడం సరదా అనుకుంటున్నావా’ అంటూ ఒకరు చీవాట్లు పెడితే.. ‘ ఇంతటి పిచ్చి పనిచేసిన నువ్వు ఇంకా బతికి ఉన్నావంటే నిజంగా అదృష్టం అంటే నీదే’  అంటూ మరొక నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

కాగా చూడటానికి ఎంతో అందంగా కనిపించే బ్లూ రింగ్డ్‌ ఆక్టోపస్‌లు అత్యంత విషపూరితమైనవి. వాటి విషం మానవ శ్వాస కోశ వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తుంది. బ్లూ రింగ్డ్‌ ఆక్టోపస్‌ విషం గనుక ఎక్కినట్లైతే నిమిషాల వ్యవధిలో మనుషులు ప్రాణాలు కోల్పోతారు. వీటి విషానికి ఇంతవరకు విరుగుడు కనుగొనలేదు.

మరిన్ని వార్తలు