కరోనా : ఆరు నిమిషాల వ్యవధిలోనే

5 Apr, 2020 16:11 IST|Sakshi

ఫ్లోరిడా : ప్రపంచాన్ని కరోనా వైరస్‌  గడగడలాడిస్తోన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 12లక్షల మందికి పైగా కరోనా వైరస్‌ బారీన పడగా.. మృతుల సంఖ్య 65వేలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాకు చెందిన వృద్ధ దంపతులు కరోనా బారీన పడి ఆరు నిమిషాల వ్యవధిలో మృతి చెందడం విషాదాంతంగా మారింది. ఈ విషయాన్ని వారి కొడుకు బడ్డీ బేకర్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల హృదయాన్ని హత్తుకుంటుంది.

వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన స్టువర్ట్‌ బేకర్‌(74), అడ్రియన్ బేకర్(72)లు 51 ఏళ్లుగా వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతూ వస్తున్నారు. ఇంతలో కరోనా వారి జీవితాలను తలకిందులు చేసింది. మార్చి మధ్యలో స్టువర్ట్‌ దంపతులు అస్వస్థతకు గురవడంతో బడ్డీ వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత బడ్డీ తండ్రికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో ఈ విషయం తన తల్లికి చెప్పకుండా స్టువర్ట్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా స్టువర్ట్‌ పరిస్థితి విషమంగా మారడంతో బడ్డీ తన తల్లి అండ్రియాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అండ్రియా ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా క్షీణించడంతో ఆమెను కూడా వెంటిలేటర్‌ మీద ఉంచి చికిత్స కొనసాగించారు.

ఈ నేపథ్యంలో వారిద్దరి శరీరంలో అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో బడ్డీ వెంటనే తన తల్లిని తండ్రి స్టువర్ట్‌ ఉన్న రూంకు తీసుకొచ్చాడు. వారిద్దరు ప్రశాంతంగా ఉండాలని ఇద్దరికి వెంటిలేటర్‌ తొలగించారు. స్టువర్ట్‌, అండ్రియాలు ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్ననిమిషాల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. 2004లో వచ్చిన అమెరికన్‌ రొమాంటిక్‌ మూవీ నోట్‌బుక్‌లో నోహా, ఎల్లిస్‌ పాత్రదారులు సినిమా క్లైమాక్స్‌లో అచ్చం ఇదే తరహాలో 6 నిమిషాల్లోనే మరణిస్తారు. కాగా ఈ వీడియోను బడ్డీ బేకర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ' మా తల్లిదండ్రులను కోల్పోయాననే విషయాన్ని అంత తేలికగా మరిచిపోలేకపోతున్నా.... కరోనా వైరస్‌ను ఫ్రాణాంతకంగా భావించి ఎప్పటికప్పుడు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించండి.. ఇంట్లోనే ఉంటూ మీ ప్రాణాలను కాపాడుకోండి' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు