అయ్యో! కొండచిలువకు ఎంత కష్టం వచ్చింది

1 Mar, 2020 09:09 IST|Sakshi

సిడ్నీ : సాధారణంగా కొండచిలువలు ఎలుకలు, ఇతర జంతువులను మింగేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే ఇక్కడ మాత్రం ఒక కొండచిలువ బీచ్‌ టవల్‌ను మింగి నానా అవస్థలు పడింది. అయితే దానికి ఎలాంటి హానీ కలగకుండా వైద్యులు కష్టపడి కొండచిలువ నోటి నుంచి టవల్‌ను బయటికి తీశారు. వివరాలు. ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి మోంటీ అనే కొండచిలువను పెంచుకుంటున్నాడు. ఒకరోజు దానిని సరదాగా బీచ్‌కు తీసుకెళ్లాడు. ఈలోగా కొండచిలువకు ఆకలయిందో ఏమో కానీ పక్కనే ఉన్న టవల్‌ను అమాంతం మింగేసింది. అయితే స్నాక్స్‌ పెడదామని భావించిన యజమానికి కొండ చిలువ నానా అవస్థలు పడుతూ కనిపించింది. దానికి ఏమైందోనని కంగారుపడిన యజమాని సిడ్నీలోని సాష్‌(స్మాల్‌ ఎనిమల్‌ స్పెషలిస్ట్‌) అనే వెటర్నరీ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. పరీక్షలు చేసిన వెటర్నరీ వైద్యులు దాని కడుపులో ఒక బారీ పదార్థం ఉందని గుర్తించారు. ఎలాగోలా కష్టపడి చివరకు విజయవంతంగా కొండచిలువ కడుపులో నుంచి టవల్‌ను బయటికి తీశారు.

'మోంటీ సురక్షితంగా ఉండడం నాకు ఆనందం కలిగించింది. అది అంత పెద్ద టవల్‌ను మింగేయడంతో కంగారుపడ్డాను. కానీ వైద్యులు చాకచక్యంగా దాని కడుపులో నుంచి టవల్‌ను బయటికి తీశారు. డాక్టర్లకు నా కృతజ్ఞతలు' అంటూ యజమాని పేర్కొన్నాడు. కాగా ఈ వీడియోనూ ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్‌ కశ్వాన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో పాటు ప్లాస్టిక్‌ వంటి పదార్థాలు మూగ జీవాలకు ఎంత ఇబ్బంది కలిగిస్తుందో చూడండి అంటూ క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు