ఈ తరహా బర్త్‌డే బంప్‌లు వద్దురా నాయనా!

2 May, 2019 15:55 IST|Sakshi

ట్విటర్‌ వేదికగా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విజ్ఞప్తి

ప్రాణం తీసిన బర్త్‌డే సంబరాలు

రెండు నెలల క్రితం జరిగిన ఘటన

ప్రముఖుల పోస్టింగ్‌లతో సోషల్‌ మీడియాలో వైరల్‌

సాక్షి, హైదరాబాద్‌ : బర్త్‌డేను స్నేహితుల మధ్య కేకు కట్‌ చేసి సెలెబ్రేట్‌ చేసుకుంటాం. ఇంకాస్త పెద్దగా అంటే ఓ పెద్ద ఫంక్షన్‌ ఏర్పాటు చేసి విందిస్తాం. కానీ ఈ తరం యువత వినూత్న పోకడలతో బర్త్‌డే సంబరాలు చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. కేకు కట్‌ చేసిన అనంతరం ఆ కేకును బర్త్‌డే బాయ్‌కి పూయడం, అతని ముఖానికి కొట్టడం వంటివి ఇప్పటి వరకు చూశాం. కానీ ఈ మధ్య బర్త్‌డే బాయ్‌ను చితక్కొట్టె నూతన సంప్రదాయనికి తెరలేపారు. కేకు కట్‌ చేసిన అనంతరం కిందపడేసి మరి చితకబాదుతున్నారు. ఇలానే రెండు నెలల క్రితం ఐఎమ్‌ఎమ్‌ విద్యార్థి తీవ్రంగా గాయపడి తుదిశ్వాస విడిచాడు. బర్త్‌డే సందర్భంగా అతడు స్నేహితులకు పార్టీ ఇవ్వగా.. ఆ పార్టీలో అతని స్నేహితుల పిచ్చి పీక్స్‌కు చేరి.. అతన్ని చితక్కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ బర్త్‌డే బాయ్‌ మరుసటి రోజు తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు. స్నేహితుల దాడిలో అతని క్లోమం పూర్తిగా దెబ్బతినడంతోనే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు పేర్కొన్నారు.

ఇక ఈ ఘటన రెండు నెలల క్రితమే జరిగినా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. భారత మాజీ క్రికెటర్‌ ఈ తరహా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చేసుకోవద్దని కోరుతూ ఈ వీడియోను షేర్‌ చేశాడు. ‘ ఇది చాలా బాధకరం. ఓ విద్యార్థి బర్త్‌డే సంబరాల కారణంగా చనిపోయాడు. ఇది అమానుషమైన దాడి.. ఈ విధంగా ఎవరూ సెలబ్రేట్‌ చేసుకోవద్దు. దయచేసి బాధ్యతాయుతంగా ఉండండి. ఈ తరహా బర్త్‌డే బంప్స్‌ వద్దు. ఇది ఎవరికి ఫన్నీ కాదు.’ అని పేర్కొన్నాడు. ఇక టాలీవుడ్‌ డైరెక్టర్‌ హరీశంకర్‌ సైతం ఈ తరహా బర్త్‌డే సంబరాలను నిషేదించాలని ట్వీట్‌ చేశాడు. నెటిజన్లు సైతం ఇదెక్కడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌రా నాయనా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు