కోహ్లినిస్తే.. కశ్మీర్‌ అడగం : పాక్‌ అభిమానులు

18 Jun, 2019 12:14 IST|Sakshi
నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ఫొటో

ఇస్లామాబాద్‌ : ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో పాకిస్తాన్‌ చిత్తుగా ఓడటాన్ని ఆ దేశ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌‌తో పాటు జట్టు ఆటగాళ్లపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ఫరాజ్‌ శరీరంపై జోకులు... కీపర్‌ మాత్రమే కాదు, ‘స్లీప్‌’ ఫీల్డర్‌ అంటూ అతని ఆవలింతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జట్టు సభ్యుల ఫిట్‌నెస్‌పై పరిహాసాలాడారు. దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాటనూ పట్టించుకోలేదని విరుచుకుపడ్డారు. పాక్‌ ఆటగాళ్లను తిట్టడానికి దొరికిన ప్రతి అస్త్రాన్ని సంధించారు. ఇక చివరకు ప్రపంచ నెంబర్‌ 1 బ్యాట్స్‌మన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని కావాలంటున్నారు. అవసరమైతే కశ్మీర్‌ను కూడా వదులుకుంటాం.. కానీ కోహ్లిని మాత్రం ఇవ్వండంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. పాక్‌ జెండాలతో ఉన్న కొంత మంది యువకుల గుంపు ‘ మాకు కశ్మీర్‌ అక్కర్లేదు.. కోహ్లినిస్తే చాలు’ అనే ప్లకార్డు ప్రదర్శించిన ఫొటో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

అయితే ఇది ఫేక్‌ ఫొటోనని గూగుల్‌ రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో స్పష్టమైంది. కశ్మీర్‌లోయలోని కొంత మంది యువకులు స్వాతంత్ర్యం కావాలని 2016 ఆగస్టులో ఈ ప్లకార్డు ప్రదర్శించగా.. ఈ ఫొటోను కొంతమంది ఔత్సాహికులు ఫొటోషాప్‌ ద్వారా తమ అవసరానికి దగ్గట్టు వాడుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో కూడా కశ్మీర్‌ను తీసుకోండి మాకు యూపీఎ ప్రభుత్వం ఇవ్వండని, హార్దిక్‌ పాండ్యా కావాలని రకరకాలుగా ప్రచారం చేశారు. దీనికి సంబంధించిన వాస్తవ ఫొటోను ఇండియా టూడే 2016 ఆగస్టు 8న ‘కశ్మీర్‌లో అశాంతి’ అనే వార్తకు జతచేసింది.

వాస్తవ ఫొటో.. తమకు స్వాతంత్ర్యం కావాలని కోరుతూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న యువకులు

వాస్తవ ఫొటోను వక్రీకరించిన నెటిజన్లు

వాస్తవ ఫొటోను జత చేస్తూ ఇండియా టూడే రాసిన కథనం

ఇక పాక్‌ను మరోసారి మట్టికరిపించిన భారత్‌.. విశ్వవేదికపై 7-0తో తమ ఆధిపత్యాన్ని కనబర్చింది. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అద్భుత శతకానికి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ అర్థశతకంతో రాణించడం.. కుల్దీప్‌, పాండ్యా, శంకర్‌లు బౌలింగ్‌లో చెలరేగడంతో భారత్‌ విజయం లాంఛనమైంది. భారత్‌ సమిష్టి ప్రదర్శన ముందు వర్షం కూడా పాక్‌ను బతికించలేకపోయింది.

మరిన్ని వార్తలు