ఆ నిర్ణయంలో మార్పు లేదు

31 Mar, 2018 11:29 IST|Sakshi

తమిళసినిమా: ఆ నిర్ణయంలో మార్పు లేదు అంటున్నారు నటి చార్మి. ఈ బ్యూటీ చాలా కాలం కిందట తమిళంలో కాదల్‌ అళివదిలై, లాడం వంటి కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత టాలీవుడ్‌పైనే దృష్టి సారించారు. పలు తెలుగు చిత్రాల్లో కథానాయకిగా నటించిన చార్మి కొన్ని స్పెషల్‌ సాంగ్స్‌లోనూ ఆడి అందాలను ఆరబోశారు. ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో నిర్మాత అవతారమెత్తారు. అయితే చార్మీపై పలు ప్రేమ వదంతులు హల్‌చల్‌ చేశాయి. తాను ప్రేమలో మోసపోయానని, అందువల్ల పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా సోషల్‌మీడియాలో ప్రచారం వైరల్‌ అవుతోంది.

ఆ సంగతేమిటో చూద్దాం. నా జీవితంలో ఒకతన్ని గాఢంగా ప్రేమించాను. అయితే రెండు కారణాలతో ఆ ప్రేమ విఫలమైంది. ఒక వేళ మేము పెళ్లి చేసుకున్నా అదే కారణాలతో విడిపోవలసివచ్చేది. ఆ వ్యక్తి ప్రవర్తన కారణంగా నాకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయింది. అయితే అతను మంచి వాడే. ఇక నాకు మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఒక వ్యక్తిని మనసారా ప్రేమించి, మరొకరితో కలిసి జీవించడం, అతని కోసం వేచి చూడటం, సమయాన్ని కేటాయించడం, వంటా వార్పు అంటూ ఇంటి పనులు చేయడం నా వల్ల కాని పని. అందుకే ఇకపై వివాహమే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని చార్మి పేర్కొన్నారు. చార్మి సంచలన నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు