కమల్‌ నా పారితోషికం చెల్లించలేదు!

26 Feb, 2018 11:20 IST|Sakshi
గౌతమి

కమల్‌పై నటి గౌతమి ఆరోపణ

టీ.నగర్‌: తనకు అందాల్సిన పారితోషికం నటుడు కమలహాసన్‌ చెల్లించలేదని నటి గౌతమి ఆరోపించారు. నటుడు కమలహాసన్‌ తన భార్య సారికను విడిచి జీవిస్తుండగా నటి గౌతమి కమల్‌తో పదేళ్లుగా కలిసి జీవించారు. 2016 అక్టోబర్‌లో ఆమె కమల్‌ను విడిచి బయటికి వచ్చారు. ఆ తర్వాత ఇరువురూ ఒకటిగా చేరలేదు. ప్రస్తుతం కమలహాసన్‌ రాజకీయ ప్రవేశం చేసి ప్రత్యేక పార్టీ ప్రారంభించడంతో కమల్, గౌతమిలు కలిసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. దీన్ని నటి గౌతమి ఖండించారు. దీనిపై ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ తామిరువురం కలిసి జీవించనున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని తెలిపారు. 2016లో ఆయనను విడిచి వచ్చిన తర్వాత ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

తాను, తన కుమార్తె భద్రంగా జీవించాలనే ఉద్దేశానికి వచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆర్థిక భద్రత కోసం తగిన చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు. కమల్‌ రాజ్‌కమల్‌ సంస్థలో కాస్ట్యూమర్‌గా పనిచేశానని, కమల్‌ నటించిన విశ్వరూపం, దశావతారం చిత్రాలకు వివిధ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకు ఆయన చెల్లించాల్సిన పారితోషికం ఇంకా చెల్లించలేదని, దీన్ని అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పారితోషికం ఇవ్వనందున ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తాను, కమల్‌ విడిపోవడానికి ఆయన కుమార్తెలు శ్రుతి, అక్షర కారకులుగా చెప్పడం సరికాదని, ఇందులో వారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇకపై అన్నింటినీ భరించి కలిసి జీవించడం కష్టమని, ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో బయటికి వచ్చానని, ఇక కలిసి జీవించేందుకు ఎటువంటి అవకాశాలు లేవని స్పష్టం చేశారు.

కమల్‌ పార్టీలోకి 2 లక్షల మంది
తన పార్టీలో చేరేందుకు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు మక్కల్‌ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకులు, నటుడు కమలహాసన్‌ తెలిపారు. కమలహాసన్‌ ప్రారంభించిన అధికారపూర్వక వెబ్‌సైట్‌లో ఆ పార్టీలో చేరేందుకు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం అందింది.

తిరుచ్చిలో ఏప్రిల్‌ 4న సభ: కమల్‌
తిరుచ్చిలో ఏప్రిల్‌ నాలుగో తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు  కమలహాసన్‌ ప్రకటించారు. అదే సమయంలో నెడువాసల్‌ వెళ్లేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు