ఆ లెజెండరీ యాక్టర్‌ ఇక లేరు

23 Nov, 2017 08:35 IST|Sakshi

గౌహతి: అస్సోంకు చెందిన లెజెండరీ యాక్టర్‌  బిజు ఫుకన్ (70) ఇక లేరు.  గౌహతిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన శ్వాస సమస్యతో  మరణిచినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు.  దీంతో ముఖ్యమం‍త్రి, గవర్నర్‌, మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు  సోషల్‌ మీడియాలో సంతాపాన్ని ప్రకటించారు.

పుకాన్‌ మరణంపై ముఖ్యమంత్రి సరబానందా సోనోవాల్‌  అసోం గవర్నర్‌ జగదీష్‌ ముఖి,మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ సహా ఇతర రాజకీయ ప్రముఖులు, ఇతర నటీనటులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అస్సామీ చలన చిత్ర పరిశ్రమలో ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ, ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు గవర్నర్‌ సానుభూతిని ప్రకటించారు. అస్సామీ చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన బిజూ ఫుకాన్  హఠాన్మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు ముఖ్యమంత్రి .  ఇది పరిశ్రమకు,  మొత్తం సమాజానికి  తీరని నష్టమని పేర్కొన్నారు.  అన్ని ప్రభుత్వ లాంఛనాలతో బిజు అంత్యక్రియలను నిర్వహిస్తామని సీఎం మీడియా సలహాదారు హృషికేష్ గోస్వామి ప్రకటించారు.

కాగా అత్యంత ప్రముఖనటులలో ఒకరుగా నిలిచిన ఫుకాన్‌ అస్సామీ చలనచిత్ర పరిశ్రమకు అనేక సూపర్‌ హిట్‌ చిత్రాలనందించారు. ఉత్తమ కథానాయుకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెల్చుకున్నారు.  1970 ల నుంచి1990 ల వరకు కొన్ని బెంగాలీ చిత్రాలతో సహా 80 చిత్రాలలో నటించారు.  ఆయన నటించిన చివరి చిత్రం ‘దూర్‌’ 2016లో విడుదలైంది.
 

మరిన్ని వార్తలు