ఓవియ ఎందుకు లేదు?

1 May, 2018 08:16 IST|Sakshi

తమిళసినిమా: కాటేరి చిత్రంలో నటి ఓవియ ఎందుకు నటించడంలేదు. ఆమెను తప్పించారా? తనే వైదొలగిందా? కోలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే. తామిరుక్క భయమే వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రం ఫేమ్‌ డీకే తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాటేరి. వైభవ్‌ హీరోగా నటిస్తున్న ఈ హారర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంలో మొదట హన్సిక నటించనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఓవియ పేరును వెల్లడించారు. చివరకు నటి వరలక్ష్మీ, సోనంబాజ్వా వచ్చి చేరారు. ఇలాఉండగా నటి ఓవియ కాటేరి నుంచి తొలగించబడిందా? తనే వైదొలగిందా? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో తరువాత ఓవియ క్రేజ్‌ అమాంతం పెరిగింది. దీంతో అవకాశాలు వరుసగా తలుపు తడుతున్నాయి.

ప్రస్తుతం లారెన్స్‌తో కాంచన–3 చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు మరో తమిళ చిత్రం,  ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. కాటేరి చిత్ర నిర్మాత కేఇ.జ్ఞానవేల్‌రాజా బిగ్‌బాస్‌ గేమ్‌ షో ప్రారంభానికి ముందు నటి ఓవియను ఎంపిక చేశారట. అప్పుడు ఆమె పారితోషికం రూ.10 లక్షల లోపే. అయితే బిగ్‌బాస్‌ షోతో అనూహ్య క్రేజ్‌ రావడంతో ఓవియ రూ.50లక్షలు పారితోషికం కావలంటూ డిమాండ్‌ చేశారట. దీంతో నిర్మాతను పక్కన పెట్టి, కథలో కొన్ని మార్పులు చేసి నటి వరలక్ష్మీ, సోనంబాజ్వాలను ఎంపిక చేసినట్లు వారి వెర్సన్‌. అయితే పారితోషికం తనకు పెద్ద విషయం కాదని, కాటేరి చిత్రంలో తాను మాత్రమే కథానాయకినని చెప్పి, ఆ తరువాత మరో ఇద్దరిని చేర్చడంతోనే ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ఓవియ చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు