ఇళయరాజాపై చర్యలు తీసుకోండి

10 May, 2018 08:36 IST|Sakshi

కమిషనర్‌కు కలెక్టర్‌ సిఫార్సులు

తమిళనాడు ,టీ.నగర్‌: ఏసుక్రీస్తుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగీత దర్శకుడు ఇళయరాజాపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో మాట్లాడిన సంగీత దర్శకుడు ఇళయరాజా హఠాత్తుగా ఏసుక్రీస్తు పునరుత్థానం గురించి వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. ఏసుక్రీస్తు చనిపోయాడు, ఆ తరువాత తిరిగి లేచాడనే విశ్వాసం క్రైస్తవుల్లో ఉందని, అయితే అది వాస్తవం కాదంటూ పరిశోధనలు జరిపి యూట్యూబ్‌లో వేస్తున్నారంటూ ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

అంతేకాకుండా వాస్తవంగా మరణించి తిరిగి లేవడం రమణ మహర్షికే చెందిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు క్రైస్తవుల్లో ఆగ్రహావేశాలు తెప్పించగా క్రైస్తవ సంఘాలు ఆందోళనలు జరిపాయి. ఇలా ఉండగా చెన్నై కమిషనర్‌ కార్యాలయంలో క్రైస్తవ సంఘాలు ఇళయరాజాపై ఫిర్యాదు చేశాయి. తాము ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని విశ్వసిస్తున్నామని అన్నారు. అందువల్ల ఇళయరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా ఉండగా న్యాయవాది దినేష్‌ చెన్నై పోలీసు కమిషనర్, కలెక్టర్, ప్రభుత్వ కార్యదర్శి, ఇళయరాజాలకు నోటీసులు పంపారు. దీంతో చెన్నై జిల్లా కలెక్టర్‌ పోలీసు కమిషనర్‌కు ఇళయరాజాపై చర్యలు తీసుకోవలసిందిగా సిఫార్సులు చేశారు.

మరిన్ని వార్తలు