ఆమె నాకెప్పుడూ స్పెషలే!

25 Jan, 2018 08:16 IST|Sakshi

తమిళసినిమా: నటి గాయత్రి తనకెప్పుడూ స్పెషలే అని అన్నారు నటుడు విజయ్‌సేతుపతి. వీరిద్దరూ కలిసి నడువుల కొంచెం పక్కత్తు కానోమ్‌ చిత్రంలో నటించారు. ఆ తరువాత ఒకటి రెండు చిత్రాల్లో నటించడంతో విజయ్‌సేతుపతి నటి గాయత్రికి సిఫారసు చేస్తున్నారనే ప్రచారం జరిగింది. చిన్న గ్యాప్‌ తరువాత తాజాగా ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌ చిత్రంలో కలిసి నటించారు. నటుడు గౌతమ్‌కార్తీక్, తెలుగు నటి ( నాగబాబు కూతురు) నిహారిక కూడా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా ఆర్ముగకుమార్‌ సొంతంగా నిర్మించి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి రెండవ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్‌ విలేకరుల సమావేశాన్ని స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర హీరోల్లో ఒకరైన విజయ్‌సేతుపతి మాట్లాడుతూ ఆర్ముగకుమార్‌ తనకు చాలా కాలంగా తెలుసన్నారు. వర్ణం చిత్రంలో తాను నటించడానికి కారణం ఈయనేనని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా ప్లాన్‌గా అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించారని తెలిపారు. చిత్రం ఆద్యంతం వినోదాన్ని అందించే విధంగా ఉంటుందని తెలిపారు. ఇందులో మరో హీరోగా నటించిన గౌతమ్‌కార్తీక్‌ తన ప్రతిభపై నమ్మకంతోనే కష్టపడి నటిస్తున్నారని అన్నారు. ఎలాంటి ఇగో లేని నటుడని పేర్కొన్నారు. ఇక నటి గాయత్రి తనకెప్పుడూ స్పెషలేనని అన్నారు. మంచి ప్రతిభ, తెలివి ఉన్న నటి అని పేర్కొన్నారు. అలాంటి వారికి సక్సెస్‌ ఆలస్యంగా వస్తుందనుకుంటా. ఈ ఏడాది గాయత్రికి బాగుంటుందని భావిస్తున్నానన్నారు.

అందరూ సహకరించారు
కాగా ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న నటి నిహారిక మాట్లాడుతూ విజయ్‌సేతుపతి, గౌతమ్‌కార్తీక్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ హీరోలతో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు తమిళ భాష తెలియకపోయినా, దర్శకుడు, హీరోలిద్దరూ ఎంతగానో సహకరించారని చెప్పారు. దీంతో కొత్తనటిననే ఫీలింగే కలగలేదని అన్నారు. 

Read latest South-india News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా