వీడిన చిక్కుముడి

14 Jan, 2018 00:46 IST|Sakshi

రామానుజుడు చెప్పే మూడో ప్రతిపాదన ఏమిటి అని అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు. ఏమిటింత ఆలస్యం అని అనుకుంటున్నారు. రామానుజుని జీవితం, వైష్ణవ లోకం మలుపు తిరుగుతున్న మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతున్న క్షణం అది. రామానుజుని వాక్కులో శారదాదేవి పలుకుతున్నట్టుంది. ఆయన అంటున్నారు. ‘‘ఆచార్యవర్యా ఇది నా మూడో ప్రతిపాదన: బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అనే ప్రస్థాన త్రయానికి విశిష్టాద్వైత దృక్కోణం నుంచి వివరమైన వ్యాఖ్యానం చేయాలని మీరు తపించినట్టు తెలుసుకున్నాను. ఆ పని చేసే శక్తినాకు ప్రసాదించండి, సంకల్పం మీది, ఆదేశం మీది, మీదే ప్రేరణ, మీరే శక్తి, స్ఫూర్తి మీరు, నేను నిమిత్తమాత్రుడైన సాధకుడిగా మీ ఆశయాన్నిసాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తాను. అనుగ్రహించండి’’ అన్నారు. 

అంతే.
మూడో వ్రేలి చిక్కుముడి కూడా వీడింది. జన్మధన్యమైందన్న భావనతో రామానుజుడి మనసు నిండిపోయింది, హృదయం ఉద్విగ్నమై ఉప్పొంగిపోతున్నది. కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. వారిని కోల్పోయామే అనే దుఃఖం ఒక వైపు, స్వామి ఆలోచనలను తెలుసుకోగలిగి అవే వారి ఉపదేశాలనీ ఆజ్ఞలనీ అర్థం చేసుకోగలిగినందుకు ఆనందం మరోవైపు, ఇవన్నీ చేయగలనా అనే ఆందోళన ఇంకో వైపు ముప్పిరిగొంటున్నాయి.మౌనంగా తలపంకించి, కన్నీటి పొరలను తప్పించి, ఆచార్యుల తిరుముఖ మండలాన్నే చూస్తూ ఉండి పోయారు. 

మహాపూర్ణుల ఆనందానికి అంతులేదు. శిష్యుల చప్పట్లు హోరెత్తుతున్నాయి. ఆచార్యుని మనసు తెలిసి, ఆయన ఆశయాలు సాధించగల సమర్థుడు, ఆయన ఆచార్యత్వానికి వారసుడు, ఆయన తరువాత ఆచార్యపీఠం అధిరోహించగల మరో ఆచార్యుడు, వైష్ణవసిద్ధాంత ప్రవక్త, మేధావి, దీక్షాదక్షుడు ఆయన ఆలోచనలకు అనుగుణంగా దొరికినందుకు సంతోషించారు. యామునుల వారు నిష్క్రమించినందుకు తీరని బాధ రగులుతున్నా భవిష్యదాచార్యుడు ప్రవేశిస్తున్నందుకు ఊరట చెందుతూ, ఈ అద్భుత విష్కంభానికి అచ్చెరువొందుతున్నారు. 

మహాపూర్ణుల వారు ఇలా అన్నారు: ‘‘రామానుజా నీజన్మ ధన్యం. ఆచార్యుల వారు నిన్నెందుకు రమ్మన్నారో నాకిప్పుడు అర్థమైంది. వారు సశరీరంగా చేయవలసిన ఉపదేశాన్ని మానసికంగా చేశారు. నీవు సాధారణంగా చెవులతో వినవలసిన ఉపదేశాలను మనసుతో విన్నావు, చిత్తం లోలోపల నిలుపుకున్నావు, సరైన సమయంలో ప్రకటించావు. గురువుగారి ఆదేశాలు నీకు అర్థమైనాయని ఆయన ఆత్మకు తెలియ జేశావు. ఇంత చేయగలిన నీకే ఆ అద్భుత కార్యాలను సాధించే శక్తి ఉందని కూడా ఈ పరీక్షతో తేలిపోయింది. నీవు ఆళవందార్‌కు ఆత్మీయ శిష్యుడివి నాయనా... ఆత్మీయ శిష్యుడివి’’.  

ఇవి రామానుజుని శపథాలుగా వినుతికెక్కాయి. అందరిముందు ఈ పనులు చేస్తానని ప్రకటించడం వల్ల యామునుల ఆశయసిధ్దికి రామానుజుని ప్రతి కదలికను పరిశీలించే అవకాశం ఏర్పడింది. రామానుజుని భవిష్యదాచార్యత్వానికి ఇదొక పరీక్ష. ఇక నీవే ఆచార్యుడివి అని మహాపూర్ణుల వారు అన్నారు. కన్నీరు తుడుచుకుని యామునాచార్యుని నఖశిఖ పర్యంతం మరోసారి పరిశీలించారు రామానుజులు. నమస్కరించారు.

 అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. రామానుజులు కాంచీ పురానికి తిరుగు ప్రయాణమైనారని తెలిసి యామునుల శిష్యులు ‘‘స్వామీ మీరిన్నాళ్లూ ఇక్కడే ఉన్నా యామునుల వారి అంతిమ కార్యక్రమాల వలన శ్రీరంగాన్ని దర్శనం చేసుకొనడానికి వీల్లేకుండా పోయింది. ఈ రోజు మీరు రండి ఆలయంలో ప్రవేశించి ఆ రంగని దర్శించండి, రండి...’’ అన్నారు. ‘‘ఒక్కరోజు యామునుల వారి సాన్నిహిత్యం లభించి ఉంటే ఈ జీవులందరినీ శ్రీవైకుంఠం చేరడానికి మెట్లు కట్టే వాడిని కదా...శ్రీరంగడికి నామీద దయలేదు. నాకు గురుసాంగత్యం లేకుండా చేశారు. ఒక్క ఘడియ నాకోసం యామునాచార్యులను మిగల్చకుండా తీసుకువెళ్లారు. 

అని కన్నీళ్లు కారుస్తూ, నాకోసం పరితపించిన యామునుడిని నేను రాకముందే తీసుకుపోయిన స్వామిని నేనేమని చూడాలి? చూడను.. వెళ్లిపోతాను, నన్ను కాచిన నా వరదుడి దగ్గరకే వెళ్లిపోతాను’’ అని చరచరా నడిచిపోతూ ఉంటే నిర్ఘాంత పోయి చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ‘ఎక్కడికి వెళ్తావు నాయనా, నీవు శ్రీరంగానికి రాక తప్పదు, ఆచార్యపీఠాన్ని అధివసించక తప్పదు. వస్తావులే, ఆ వరదుడు పంపిస్తాడు, ఈ శ్రీరంగడు రప్పిస్తాడు’.. అని మనసులోనే అనుకుంటున్నారు మహాపూర్ణులవారు. అందరికీ నమస్కరించి యామునాచార్యుల జ్ఞాపకాలతో కాంచీపురం వైపు అడుగులు వేస్తున్నారు. 
∙∙ 
రామానుజుడు చెప్పగా కాంచీపూర్ణులు, కాంతిమతి దుఃఖించారు. యామునాచార్యుల ప్రత్యక్ష ఆదరణ లభించకపోయినా ఆయన అంతరంగాన్ని రామానుజుడు తన ఆలోచనాశక్తితో ఆవిష్కరించడం కాంచీ పూర్ణులకు శుభ సూచకంగా కనిపించింది.దుఃఖ సంతప్త హృదయుడైన రామానుజుని ఊరడించడానికి, ‘రామానుజా, వరదుడుకి అన్నీ తెలుసు. యామునుల ఆశయసాధనకు నీవే సాధనానివి. ఆ దారి ఆయనే చూపిస్తాడు’ అన్నాడు కాంచీ పూర్ణుడు. 

వెంటనే ఆయన కాళ్లమీద పడి మీరే ఈ సందిగ్ధాత్ముని ఉద్ధరించాలి స్వామీ.  నన్ను శిష్యుడిగా స్వీకరించి దివ్య సత్యమార్గాన్ని ప్రబోధించండి. అని వేడుకున్నాడు. ‘నేను వైశ్యుడిని నీవేమో బ్రాహ్మణ కులంలో పుట్టిన వరపుత్రుడివి. నీకున్న పాండిత్యం కూడా నాకు లేదు. కనుక అందుకు నాకు అర్హత లేదు నాయనా. వరదుని సేవించడం తప్ప నాకు అన్యమేమీ తెలియదు. ఆ స్వామిని నేను వేడుకుంటాను, నీకు శాంతిని కలిగించమని’... అన్నారు.

‘మీరు నిరాడంబరులు. నిరహంకారులు. మీకు కులమేమిటి మహాత్మా. మీరు ఈ సంకుచిత కుల నియమాలకు అతీతులు. అపార జ్ఞాన సంపన్నులు. భక్తిప్రపత్తులు నిండిన మహానుభావులు. నాకు జ్ఞానోపదేశం చేయండి. వర్గదర్శనం చేయండి’ అన్నారు రామానుజుడు.తాను ఈ కులభేదం చూపడం లేదని స్వామికి తెలియజేయడానికి, రామానుజుడు మరునాడు కాంచీపూర్ణులు తన ఇంట సాపాటు (భోజనం)  చేయాలని కోరారు. దుఃఖంలో ఉన్న రామానుజుడికి ఊరట కలిగించడానికి ఉత్సాహపరచడానికి ఆయన అంగీకరించారు. రామానుజుడు సతి రక్షకాంబకు కాంచీపూర్ణస్వామి తమ ఇంటికి సాపాటుకు దయచేస్తున్నారని తెలియజేశాడు. రక్షకాంబకు మడి కట్టుబాట్లు ఎక్కువ. తిరుక్కచ్చినంబి అనే వైశ్యుడిని ఇంటికి పిలిచినందుకు నిరాశ పడింది.  రామానుజులు వరదుని తిరుమంజనసేవకు తీర్థం తీసుకుపోయే పనిని మానలేదు. అది నిత్యమూ సాగవలసిందే. 

ఆ సేవ ముగించుకుని త్వరత్వరగా ఇంటికి వస్తూనే ఉన్నారు. కాంచీపూర్ణస్వాములు కనిపించలేదు. స్వామి వారు ఇంకా రాలేదా అని భార్యను అడిగారు.  కాని అప్పడికే వారు సాపాటు చేసి వెళ్లినట్టు రక్షకాంబ చెప్పింది.  ఆలయంలో ఏదో పని ఉందని, వంట పూర్తయితే వడ్డించమని అడిగారు. త్వరగా ఆలయానికి వెళ్లిపోవాలన్నారు. సిద్ధంగా ఉంది కనుక వడ్డించాను. సాపాటు చేసి వెళ్లిపోయారు. ఆచార్య భోజన శేషపదార్థములు ఉన్నాయా అని అడిగారు. ఏమీలేదు. అంతా తొలగించి ఆవు పేడతో శుద్ధిచేశాను, వచ్చిన వారు వైశ్యులు కదా అందుకని... అని చెప్పింది తంజమ్మ. 

రామానుజులు చాలా బాధ పడ్డారు ఏ కుల భేదం లేదని చెప్పడానికి కాంచీపూర్ణులను తాను ఆహ్వానించానో, ఆ భేదాన్ని చూపి తంజ అవమానించింది. ఎంత అపరాధం చేసావు తంజా.. అంతటి మహాజ్ఞానిని ఆదరించడానికి నీకు కులమూ మడి అడ్డొచ్చాయా? ఆయన నాకు ఆచార్యుడని తెలియదా? అని సౌమ్యంగానే మందలించి, వడివడిగా కాంచీపూర్ణుల దగ్గరకు వెళ్లి ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగి క్షమించమని వేడుకున్నాడు. 

ఏం జరిగిందని క్షమించాలి రామానుజా, మీ ఇంట సాపాటు చేశాను వచ్చాను. ఇంకేం.. అని ఏమీ జరగనట్టే వారు వదిలేశారు. వెంటనే ఆయన కాళ్లమీద పడి ‘‘మీరే ఈ సందిగ్ధాత్ముని ఉద్ధరించాలి స్వామీ.  నన్ను శిష్యుడిగా స్వీకరించి దివ్య సత్యమార్గాన్ని ప్రబోధించండి’’. అని వేడుకున్నాడు. ‘‘నేను వైశ్యుడిని నీవేమో బ్రాహ్మణ కులంలో పుట్టిన వరపుత్రుడివి. నీకున్న పాండిత్యం కూడా నాకు లేదు. కనుక అందుకు నాకు అర్హత లేదు నాయనా. వరదుని సేవించడం తప్ప నాకు అన్యమేమీ తెలియదు. 

ఆ స్వామిని నేను వేడుకుంటాను, నీకు శాంతిని కలిగించమని...’’ అన్నారు‘‘మీరు నిరాడంబరులు. నిరహంకారులు. మీకు కులమేమిటి మహాత్మా. మీరు ఈ సంకుచిత కుల నియమాలకు అతీతులు. అపార జ్ఞాన సంపన్నులు. భక్తిప్రపత్తులు నిండిన మహానుభావులు. నాకు జ్ఞానోపదేశం చేయండి. మార్గదర్శనం చేయండి’’.  అన్నారు.‘అడియేన్‌ స్వామీ... దాసోహం. మీ దయే నాకు కావలసింది’’ అంటూ  ‘‘పరమభక్తులు మీరు. మీకన్న నాకు గురువు వేరే దొరకరు. నన్ను శిష్యుడిగా స్వీకరించండి స్వామీ’’ అని ప్రాధేయపడ్డారు. 

కాంచీపూర్ణులు ఇలా అన్నారు...‘‘ఎంత మాటన్నావు నాయనా.. నీకు గురువుగా ఉండే అర్హత నాకు లేదు నాయనా, ఆ వరదుడి దయవల్ల నీలో నాపైన ఇంత ప్రేమ ఉందనుకుంటాను’’. ‘‘తక్కువ కులం కనుక అర్హతలేదంటారా స్వామీ. మన పవిత్ర గ్రంథాలు ఈవిధంగా ప్రతిపాదించలేదే, ఎవరూ వాదించలేదే. మహాత్ములు సమాజంలోని ఏ కులంలోనైనా జన్మిస్తారు. పరాత్పరుడిని ముఖాముఖంగా చూడగలిగిన వారికి వారి జన్మ, కులం చాలా స్వల్పమైన విషయాలని చెప్పాయి కదా..‘‘ 

‘‘నాకు మరీ ఎక్కువ గౌరవాన్ని ఆపాదిస్తున్నావు. అది సరే... మనం మౌలికంగా కులాలను, జన్మతః వచ్చిన తారతమ్యాలను పాటించడం సమాజధర్మమని భావిస్తున్నామా లేదా, ఆ విధంగా కులధర్మం వృత్తి ధర్మం కట్టుబాట్లను గౌరవించాల్సిందే కదా. గుణకర్మలను బట్టి చాతుర్వర్ణాల ఆధారంగా సమాజ నిర్మాణం జరిగిందని అంటున్నాం కదా. శ్రేష్ఠులు ఆచరించినవాటినే తరతరాల వరకు సమాజం స్థిర ఆచారంగా పాటిస్తుంది కదా. ఈ లోకంలో నేను నిర్వర్తించవలసిన బాధ్యతంటూ ఏదీ లేదు. 

సాధించి తీర్చుకోవలసిన కోరికలు కూడా ఏమీ లేవు. అయినా సహజమైన కుల, వృత్తి బాధ్యతలను, కర్మలను నిర్వర్తించవలసిన అవసరం ఉంది కదా. ప్రతివ్యక్తి తన ధర్మాన్ని విద్యుక్త బాధ్యతలను నిర్వర్తించకపోతే ప్రపంచం నిలబడుతుందా? తమ శక్తి వనరుల విస్తృతిని బట్టి నాలుగు వర్ణాల విభజన జరిగిందని తెలుసుకదా? ఈ కులాలను కలగలిపి అయోమయం సృష్టిస్తే  జీవరాశిని నష్టపరచడం కాదా, ఆ పని నేను చేయాలంటావా? కుల వృత్తి ధర్మాలను పాటించకుండా నిజాన్ని తప్పి వ్యవహరిస్తే అంధకార నరకాల్లోకి ప్రయాణిస్తాం కదా. సంఘాన్ని సంఘటితంగా ఉంచడానికి ప్రతి వ్యక్తి తన బాధ్యతను నిర్వహించవలసిందే’’. 

‘‘కర్మబంధాలలో పడకుండా కర్మలను ఆచరించాలి. కర్మను అంటి పెట్టుకోకుండా కర్మను ఆచరించాలని కదా పెద్దలు చెబుతున్నది. ఎంత ఆకర్షణీయంగా ఉన్నా పరధర్మాన్ని పాటించడం కన్న కష్టమైనప్పటికీ స్వధర్మాన్ని పాటించడం ముఖ్యం కదా.  ఆ బాధ్యతా నిర్వహణలో మరణం సంభవించినా సరే వెనుకాడకూడదు. బాగా తెలిసిన వ్యక్తులు, అంతగా తెలియని వారి నమ్మకాలను వమ్ము చేయకూడదు కదా’’ అని పరిపరివిధాల కాంచీపూర్ణులు రామానుజుడికి నచ్చ జెప్పారు. ‘‘మీరెన్ని చెప్పినా మీ పట్ల నా గురుభావం నమ్మకం తగ్గదు. నా ఆశయాల సాధనకు ఈ కులపరిమితులు అడ్డురాలేవు..అని జవాబిచ్చి ఇంటికి వెళ్లాడు రామానుజుడు. ఏవిధంగా తన ఆశయాలు సాధించాలి.  ఈ కుల పరిమితుల నుంచి జ్ఞానాన్ని విముక్తం చేయడం ఏ విధంగా? అని రాత్రంతా ఆలోచించాడు. 

మరిన్ని వార్తలు