అప్పుడు చందర్‌పాల్‌‌.. ఇప్పుడు కోహ్లి

16 Jan, 2019 21:34 IST|Sakshi

ప్రతీ ఒక్కరికీ గడిచిన క్షణాలను నెమరువేసుకోవడం ఓ సరదా. కానీ ఆ సరదానే ఇప్పుడు చాలెంజ్‌గా మారింది. ఐస్‌ బకెట్‌, కికీ, ఫిట్‌నెస్‌, తదితర చాలెంజ్‌లు ప్రపంచాన్ని ఊపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ తరహాలోనే ‘టెన్‌ ఇయర్‌ చాలెంజ్‌’ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో భాగంగా పదేళ్ల క్రితం దిగిన ఫొటోను, ఇప్పటి ఫొటోను జత చేయాలి. ఇక ఇప్పటికే సినీతారలు, నెటిజన్లు తమ ఫోటోలను షేర్‌ చేస్తూ, పదేళ్లలో తమ జీవితంలో జరిగిన మార్పులను ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా తమ సన్నిహితులకు, స్నేహితులకు చాలెంజ్‌ విసురుతున్నారు.  తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కూడా ‘టెన్‌ ఇయర్‌ చాలెంజ్‌’ను స్వీకరించి తమ అధికారిక వెబ్‌ సైట్‌లో పలు ఫోటోలను షేర్‌ చేసింది. పదేళ్ల క్రితం నాటి క్రికెట్‌ అనుభూతులను గుర్తు చేస్తూ ఐసీసీ చేసిన ట్వీట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

పదేళ్ల క్రితం అంటే 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా.. 2019లో ఇప్పటివరకు టాప్‌ ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాకు సంబంధించిన ఫోటోలను ఐసీసీ షేర్‌ చేసింది. 2009లో టెస్టుల్లో నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌గా వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు శివనారాయణ్‌ చందర్‌పాల్‌ ఉండగా, ప్రస్తుతం టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్‌ జాబితాలో శ్రీలంక స్పిన్‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడా నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాడు. ఐసీసీ చేసిన ట్వీట్‌ చూసి పదేళ్ల క్రితం క్రికెటర్లను గుర్తు చేసుకుంటున్నామని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు