బెంగాల్‌కు 72 పరుగులు... సౌరాష్ట్రకు 4 వికెట్లు! 

13 Mar, 2020 04:01 IST|Sakshi

రసకందాయంలో రంజీ ట్రోఫీ ఫైనల్‌

టైటిల్‌ కోసం ఇరు జట్ల పోరాటం

నేడు ఆటకు చివరి రోజు 

రాజ్‌కోట్‌: సౌరాష్ట్ర, బెంగాల్‌ మధ్య జరుగుతోన్న రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ రసకందాయంలో పడింది. ఇప్పటికే నాలుగు రోజులు గడవడంతో మ్యాచ్‌లో విజేత తేలే పరిస్థితి లేదు... అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జట్టుకే రంజీ ట్రోఫీ దక్కనుండటంతో ఇరు జట్లు కూడా కీలకమైన తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో బెంగాల్‌కు 72 పరుగుల కావాల్సి ఉండగా... సౌరాష్ట్రకు 4 వికెట్లు అవసరం. నేడు ఆటకు చివరి రోజు. 291 పరుగులు వెనుకబడి... 134/3 స్కోరుతో గురువారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన బెంగాల్‌ ఆట ముగిసే సమయానికి 147 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగులు చేసింది. ప్రస్తుతం అనుస్తుప్‌ మజుందార్‌ (58 బ్యాటింగ్‌; 8 ఫోర్లు), అర్నబ్‌ నంది (28 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, సిక్స్‌) క్రీజులో ఉన్నారు.

ఆదుకున్న సుదీప్, సాహా 
అంతకుముందు నాలుగో రోజు ఆటను ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ సుదీప్‌ చటర్జీ (81; 7 ఫోర్లు), వృద్ధిమాన్‌ సాహా (64; 10 ఫోర్లు, సిక్స్‌) నిలకడగా ఆరంభించారు. ఈ రంజీ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న సాహాకు గురువారం ఆటలో అదృష్టం బాగా కలిసొచ్చింది. రెండు సార్లు ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ నుంచి తప్పించుకున్న అతడికి... సౌరాష్ట్ర ఫీల్డర్ల నుంచి రనౌట్, క్యాచ్‌ రూపాల్లో రెండు లైఫ్‌లు లభించాయి. దీనిని ఆసరాగా చేసుకున్న సాహా... సుదీప్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 101 పరుగులు జోడించాడు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్‌కు చేరడంతో పాటు షహబాజ్‌ అహ్మద్‌ (16; 2 ఫోర్లు) అవుట్‌ అవడంతో... మ్యాచ్‌ మరోసారి సౌరాష్ట్ర వైపుకు మళ్లింది.

ఈ దశలో జతకట్టిన అనుస్తుప్, అర్నబ్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను మొదటి స్లిప్‌లో ఉన్న హార్విక్‌ దేశాయ్‌ నేలపాలు చేయడంతో బతికి బయటపడ్డ అనుస్తుప్‌... ఆ తర్వాత కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు అర్నబ్‌తో కలిసి ఏడో వికెట్‌కు అభేద్యంగా 91 పరుగులు జోడించాడు. నేడు జరిగే ఆఖరి రోజు ఆటలో బెంగాల్‌ 72 పరుగులు సాధిస్తే... 30 ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలుస్తుంది. చివరిసారిగా 1989–90 సీజన్‌లో బెంగాల్‌ టైటిల్‌ సాధించింది. అయితే పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటం... చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉండటం బెంగాల్‌ చారిత్రక విజయానికి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా