ఓటమి అంచుల నుంచి గట్టెక్కిన ఫెడరర్‌

29 Jan, 2020 01:48 IST|Sakshi

ఏడు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకున్న స్విట్జర్లాండ్‌ స్టార్‌

అమెరికా ప్లేయర్‌ సాండ్‌గ్రెన్‌పై  ఐదు సెట్‌లలో విజయం

15వసారి ఆస్ట్రేలియన్‌  ఓపెన్‌లో సెమీస్‌లోకి

ప్రత్యర్థి అనుభవలేమి... సులువుగా ఓటమిని అంగీకరించకూడదన్న నైజం... కాస్తంత అదృష్టం... వెరసి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌ మళ్లీ బతికిపోయాడు. తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లో ఏకంగా ఏడు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని ఈ మాజీ చాంపియన్‌ గట్టెక్కాడు. ప్రపంచ 100వ ర్యాంకర్‌ టెనిస్‌ సాండ్‌గ్రెన్‌తో మంగళవారం జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌ ఐదు సెట్‌లలో విజయాన్ని అందుకొని 15వసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)తో ఫెడరర్‌ తలపడతాడు.   

మెల్‌బోర్న్‌: కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ వేటలో స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ మరో అడ్డంకిని అధిగమించాడు. మంగళవారం 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ ఫెడరర్‌ 6–3, 2–6, 2–6, 7–6 (10/8), 6–3తో అన్‌సీడెడ్‌ టెనిస్‌ సాండ్‌గ్రెన్‌ (అమెరికా)పై తీవ్రంగా చెమటోడ్చి గెలుపొందాడు. ఈ టోరీ్న లోని మూడో రౌండ్‌లో జాన్‌ మిల్‌మన్‌ (ఆ్రస్టేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి రెండు పాయింట్ల దూరంలో నిలిచి గట్టెక్కిన ఫెడరర్‌... క్వార్టర్‌ ఫైనల్లో మాత్రం ఏకంగా ఏడు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. తన 22 ఏళ్ల కెరీర్‌లో ఫెడరర్‌ ఏడు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి మాత్రమే.

2003లో సిన్సినాటి టోర్నీలో స్కాట్‌ డ్రెపర్‌తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లోనూ ఫెడరర్‌ ఏడు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని గెలుపొందాడు. ఆరుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన ఫెడరర్‌ గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్, రెండో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)తో తలపడతాడు. నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ మరో రెండు క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఏడో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో వావ్రింకా (స్విట్జర్లాండ్‌); ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆ్రస్టియా)తో టాప్‌ సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఆడతారు.

సాండ్‌గ్రెన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌ నాలుగో సెట్‌లో స్కోరు 4–5 వద్ద తన సర్వీస్‌లో మూడు మ్యాచ్‌ పాయింట్లను... అనంతరం ఇదే సెట్‌లోని టైబ్రేక్‌లో 3–6 వద్ద మూడు మ్యాచ్‌ పాయింట్లను... 6–7 వద్ద మరో మ్యాచ్‌ పాయింట్‌ను కాపాడుకున్నాడు. స్కోరు 8–8తో సమంగా ఉన్నపుడు సాండ్‌గ్రెన్‌ వరుసగా రెండు తప్పిదాలు చేయడంతో చివరకు ఫెడరర్‌ టైబ్రేక్‌ను  10–8తో గెలిచి సెట్‌ను దక్కించుకున్నాడు. ఏకంగా ఏడు మ్యాచ్‌ పాయింట్లను వదులుకోవడం ఐదో సెట్‌లో సాండ్‌గ్రెన్‌ ఆటతీరుపై ప్రభావం చూపింది. చివరి సెట్‌లో సాండ్‌గ్రెన్‌ పూర్తిగా డీలా పడ్డాడు. ఆరో గేమ్‌లో సాండ్‌గ్రెన్‌ సరీ్వస్‌ను బ్రేక్‌ చేసిన ఫెడరర్‌ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని చివరకు 6–3తో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకొని విజయాన్ని అందుకున్నాడు.

►ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చరిత్రలో ఫెడరర్‌ నెగ్గిన మ్యాచ్‌ల సంఖ్య 102. తాజా గెలుపుతో ఫెడరర్‌ ఒకే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును (వింబుల్డన్‌లో 101 విజయాలు) సవరించాడు.  

►ఓవరాల్‌గా ఫెడరర్‌ తన కెరీర్‌లో 46వసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో (ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌–15; వింబుల్డన్‌–13; ఫ్రెంచ్‌ ఓపెన్‌–8; యూఎస్‌ ఓపెన్‌–10 సార్లు) సెమీఫైనల్‌ చేరాడు.  

►కెన్‌ రోజ్‌వెల్‌ (42 ఏళ్ల 68 రోజులు–1977లో) తర్వాత ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరిన పెద్ద వయస్కుడిగా ఫెడరర్‌ (38 ఏళ్ల 178 రోజులు) గుర్తింపు పొందాడు.

జొకోవిచ్‌ ఎనిమిదోసారి...

మరో క్వార్టర్‌ ఫైనల్లో ఏడుసార్లు చాంపియన్‌ జొకోవిచ్‌ 6–4, 6–3, 7–6 (7/1)తో 32వ సీడ్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా)పై విజయం సాధించి ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన ఏడుసార్లూ జొకోవిచ్‌ టైటిల్‌తో తిరిగి వెళ్లడం విశేషం. ఫెడరర్‌తో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్‌ 26–23తో ఆధిక్యంలో ఉన్నాడు.   

తొలిసారి సెమీస్‌లో బార్టీ, సోఫియా

మహిళల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా), 14వ సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) తొలిసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో బార్టీ 7–6 (8/6), 6–2తో ఏడో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై... సోఫియా 6–4, 6–4తో ఆన్స్‌ జెబూర్‌ (ట్యూనిషియ)ఫై నెగ్గారు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పేస్‌–ఒస్టాపెంకో జంట పరాజయం
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జంట పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో పేస్‌–ఒస్టాపెంకో ద్వయం 2–6, 5–7తో జేమీ ముర్రే (బ్రిటన్‌)–బెథానీ మాటెక్‌ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు