ఐపీఎల్‌ వేలం: అఫ్గాన్‌ క్రికెటర్ల హవా

28 Jan, 2018 14:22 IST|Sakshi
నబీ, రషీద్‌ ఖాన్‌, జద్రాన్‌, జహీర్‌ ఖాన్‌

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా జరుగుతున్న వేలంలో అఫ్గానిస్తాన్‌ క్రికెటర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకూ నలుగురు అఫ్గానిస్తాన్‌ క్రికెటర్లు ఐపీఎల్‌ వేలంలో మెరిసి తమ దేశానికి వన్నె తెచ్చారు. ఇందులో ముగ్గరు క్రికెటర్ల కోట్ల రూపాయిలను కొల్లగొట్టడం ఇక్కడ మరో విశేషం. రషీద్‌ ఖాన్‌(రూ. 9 కోట్లు)ను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రైట్‌ టు మ్యాచ్‌ కార్డ్‌ పద్ధతి ప్రకారం సొంతం చేసుకోగా, మొహ్మద్‌ నబీ(రూ. 1 కోటి)ని సైతం సన్‌ రైజర్స్‌ దక్కించుకుంది. వీరిద్దరూ గతంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్య వహించిన క్రికెటర్లే కాగా, ఇక మరో అఫ్గాన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ముజీబ్‌ జద్రాన్‌(రూ. 4 కోట్లు)ను కింగ్స్‌ పంజాబ్‌ పోటీ పడి మరీ దక్కించుకుంది.

జర్దాన్‌ కనీస ధర రూ. 50 లక్షలు మాత్రమే ఉండగా కోట్లు వెచ్చించి మరీ కింగ్స్‌ పంజాబ్‌ కొనుగోలు చేసింది. దాంతో ఈ ఐపీఎ‍ల్‌ వేలంలో అమ్ముడిపోయిన మూడో అఫ్గాన్‌ క్రికెటర్‌గా జర్దాన్‌ నిలిచాడు. కాగా, మరో అఫ్గాన్‌ ప్లేయర్‌ జహీర్‌ ఖాన్‌(రూ. 60 లక్షలు)ను రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. అతని కనీస ధర రూ. 20 లక్షలు కాగా, మూడు రెట్లు అధికంగా అమ్ముడుపోయాడు. ఫలితంగా ఐపీఎల్‌ వేలంలో కొనుగోలైన నాల్గో అఫ్గానిస్తాన్‌ క్రికెటర్‌ గా గుర్తింపు సాధించాడు.

మరిన్ని వార్తలు