17 నుంచి బేస్‌బాల్ ప్రీమియర్ లీగ్

14 Nov, 2013 00:07 IST|Sakshi

 పంజగుట్ట, న్యూస్‌లైన్: వరుసగా రెండో ఏడాది బేస్‌బాల్ ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. గత ఏడాది విజయవంతంగా జరిగిన ఈ టోర్నీని ఈ నెల 17 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు టోర్నీ వివరాలు వెల్లడించారు.
 
  గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో ఆరు ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి. భారత్, కొరియా, నేపాల్‌లకు చెందిన దాదాపు 100 మంది జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. ప్రతీ రోజు మూడు సెషన్ల పాటు పోటీలు నిర్వహిస్తారు. ఈ టోర్నీకి ఎస్‌బీహెచ్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. గత ఏడాది ప్రీమియర్ లీగ్‌కు లభించిన ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది విదేశీ ఆటగాళ్లతో టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ సీవీ ప్రతాప్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బేస్‌బాల్ సంఘం కార్యదర్శి ఎల్.రాజేందర్, సంయుక్త కార్యదర్శి అమిత్ గాడ్సే తదితరులు పాల్గొన్నారు.
 
 టోర్నీలో పాల్గొనే జట్లు
  1. అపోలో రాకెట్స్, 2. మైలాన్ పైరేట్స్, 3. ఐబీఏ బెంగళూరు, 4. ప్రొ ఫిట్ స్మాషర్స్, 5. సీఈఏ జెయింట్స్, 6. యంగ్‌మెన్ క్లబ్స్
 

మరిన్ని వార్తలు