ఆ మరుపురాని ఘట్టానికి 19ఏళ్లు

7 Feb, 2018 11:59 IST|Sakshi

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో సంచలనం జరిగిన రోజు అది. భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను కసితీరా ఓడించిన రోజు. భారత మాజీ స్పిన్నర్‌ కుంబ్లే జీవితంలో మరిచిపోలేని రోజు. తన స్పిన్‌తో దాయాది దేశాన్ని చాపచుట్టేసినట్లు చుట్టేశాడు. క్రికెట్‌ అభిమానులకు మరిచిపోలేని బహుమతి ఇచ్చాడు. ఆ మరుపురాని ఘటనకు నేటితో 19ఏ‍ళ్లు నిండాయి.

అది ఫిబ్రవరి 7,1999 దాయాది పాకిస్తాన్‌తో టెస్టు మ్యాచ్‌, ఢిల్లీ, ఫిరోజ్‌షా కోట్ల స్టేడియం. పాకిస్తాన్‌ ముందు 420 కొండంత లక్ష్యం, ఒక్కరోజు మాత్రమే మిగిలింది. చివరి రోజు 101 పరుగలకు 1వికెట్‌ నష్టంతో పాకిస్తాన్‌ డ్రా కోసం ఆడుతోంది. అప్పుడే రంగంలోకి దిగాడు అనిల్‌ కుంబ్లే. గింగిరాలు తిరిగే బంతితో పాక్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. సయీద్‌ అన్వర్‌, షాహిద్‌ ఆప్రీదిలు కొద్ది సేపు నిలువరించినా చివరికి లొంగక తప్పలేదు. అంతే కుంబ్లే విసిరే స్పిన్‌ను ఎదుర్కొనలేని పాక్‌ ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఈ మ్యాచ్‌లో కుంబ్లే పదికి పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచంలో పది వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఇంగ్లండ్‌కు చెందిన జిమ్‌ లాకెర్‌ 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన 4వటెస్టు మ్యాచ్‌లో పదివికెట్లు తీశాడు. ఆయన తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఆటగాడు అనిల్‌ కుంబ్లేనే. ఈ మ్యాచ్‌లో కుంబ్లే 26.3 ఓవర్లు బౌలింగ్‌ చేయగా ఇందులో 9ఓవర్లు మెయిడెన్లు ఉన్నాయి. 74 పరుగులు ఇచ్చి 10వికెట్లు తీసి పాకిస్తాన్‌ వెన్నువిరిచాడు. ఈ మ్యాచ్‌లో 207 పరుగులకు పాక్‌ ఆలౌట్‌ అయింది. భారత్‌ 212 పరుగులతో భారీ విజయం సాధించింది. ఈ అద్భుత విజయానికి నేటితో 19ఏ‍ళ్లు నిండాయి.

మరిన్ని వార్తలు