వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత తొలి మ్యాచ్‌లోనూ..

1 Nov, 2019 11:55 IST|Sakshi

క్రిస్ట్‌చర్చ్‌:  ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా ఇక్కడ హాగ్లే ఓవల్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ మూడు వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది.  ఇంగ్లండ్‌ లక్ష్య ఛేదనలో జానీ బెయిర్‌ స్టో(35) మంచి ఆరంభాన్ని ఇవ్వగా, జేమ్స్‌ విన్సే(59; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌( 34 నాటౌట్‌; 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌)లు రాణించడంతో ఇంగ్లండ్‌ సునాయాసంగా గెలుపును అందుకుంది. సౌతీ వేసిన 19 ఓవర్‌ రెండో బంతిని ఫోర్‌ కొట్టిన మోర్గాన్‌.. మూడో బంతిని సిక్స్‌ కొట్టి ఇంగ్లండ్‌ గెలుపును ఖాయం చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌(2) నిరాశపరచగా, కొలిన్‌ మున్రో- టిమ్‌ సీఫెర్ట్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది యత్నం చేసింది. కాగా, మున్రో(21) రెండో వికెట్‌గా ఔట్‌ కాగా, సీఫెర్ట్‌(32) ఫర్వాలేదనిపించాడు. చివర్లో రాస్‌ టేలర్‌(44; 35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), డారిల్‌ మిచెల్‌(30 నాటౌట్‌; 17 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు)లు రాణించడంతో న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అయితే ఈ లక్ష్యం ఇంగ్లండ్‌ ముందు చిన్నబోయింది. ఇంకా తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లిష్‌ టీమ్‌ లక్ష్యాన్ని  చేరుకుంది. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడిన తర్వాత ఇదే వారి మధ్య  తొలి మ్యాచ్‌. వరల్డ్‌కప్‌ ఫైనల్లో బౌండరీ కౌంట్‌ నిబంధనతో కప్‌ గెలిచిన ఇంగ్లండ్‌.. తాజా మ్యాచ్‌లో కూడా ఆకట్టుకుని విజయాన్ని నమోదు చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా