పట్టు ...విడుపు!

8 Dec, 2018 00:44 IST|Sakshi

రాణించిన అశ్విన్, ఇషాంత్, బుమ్రా

ఆస్ట్రేలియా 191/7

ఆదుకున్న ట్రావిస్‌ హెడ్‌ 

టాపార్డర్‌ను కూల్చినా... మిడిలార్డర్‌ను దెబ్బతీసినా... టీమిండియాకు తోక దెబ్బ మాత్రం తప్పలేదు. చిక్కిన పట్టును విడిచిపెట్టి... ప్రత్యర్థికి కోలుకునే అవకాశమిచ్చే బలహీనతను కోహ్లి సేన వీడలేదు. దీంతో ఆతిథ్య ఆస్ట్రేలియా... భారత్‌ ఆధిక్యానికి గండికొట్టింది. అజేయ అర్ధశతకం చేయడంతో పాటు... కీలక సమయంలో అర్ధశతక భాగస్వామ్యంలో పాలుపంచుకున్న ట్రావిస్‌ హెడ్‌ జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు. మన బౌలర్లు మరోసారి విజృంభించి... కంగారూల తొలి ఇన్నింగ్స్‌ను ఎంత త్వరగా ముగిస్తే అంత మేలు!  

అడిలైడ్‌: బ్యాటింగ్‌లో బలహీనంగా ఉన్నా, సొంతగడ్డపై అంత తేలిగ్గా ఏమీ తలొగ్గమని చాటుతోంది ఆస్ట్రేలియా. లోయరార్డర్‌ కథ ముగించలేని భారత్‌ బలహీనతే తమ బలంగా పోరాడుతూ, ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది ఆ జట్టు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ ట్రావిస్‌ హెడ్‌ (149 బంతుల్లో 61 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో ఆపద్బాంధవుడిగా నిలవడంతో టీమిండియా స్కోరుకు మరో 59 పరుగుల దూరంలో ఉంది. ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/50) మాయాజాలం, పేసర్లు ఇషాంత్‌ శర్మ (2/31), జస్‌ప్రీత్‌ బుమ్రా (2/34) దెబ్బకు తడబడినా... హ్యాండ్స్‌కోంబ్‌ (93 బంతుల్లో 34; 5 ఫోర్లు), కమిన్స్‌ (10)తో కలిసి హెడ్‌ నెలకొల్పిన భాగస్వామ్యాలతో కంగారూలు కోలుకున్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ షమీ (6)ని హాజల్‌వుడ్‌ (3/52) శుక్రవారం తొలి బంతికే ఔట్‌ చేయడంతో 250 వద్దే భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ ముగిసింది. 

దాదాపు అదే తీరుగా... 
ఒక్క బంతి మినహా రెండో రోజంతా సాగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌... అచ్చం మొదటి రోజు భారత బ్యాటింగ్‌ సాగిన తీరును తలపించింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న సంతృప్తితో బరిలో దిగిన ఆసీస్‌ను మొదటి ఓవర్లోనే ఇషాంత్‌ దెబ్బతీశాడు. ఎదుర్కొన్న మూడో బంతినే డ్రైవ్‌ చేయబోయిన ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ (0) బౌల్డయ్యాడు. అయితే, అరంగేట్ర ఓపెనర్‌ మార్కస్‌ హారిస్‌ (57 బంతుల్లో 26; 3 ఫోర్లు) వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖాజా (125 బంతుల్లో 28; 1 ఫోర్‌) కొంతసేపు ప్రతిఘటించారు. రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌కు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తొలుత అతడి ఫ్లయిటెడ్‌ డెలివరీని ఎదుర్కొనడంలో విఫలమైన హారిస్‌... సిల్లీ మిడాఫ్‌లో విజయ్‌కు తేలికైన క్యాచ్‌ ఇచ్చాడు. 57/2తో లంచ్‌కు వెళ్లిన ఆసీస్‌ను... విరామం అనంతరం తొలి ఓవర్లోనే రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో దెబ్బకొట్టాడు. అతడి బౌలింగ్‌లో దూరంగా వెళ్తున్న బంతిని షాన్‌ మార్‌‡్ష (2) వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఓవైపు హ్యాండ్స్‌కోంబ్‌ పరుగులు రాబడుతున్నా, మరో ఎండ్‌లో క్రీజులో పాతుకుపోవడమే ఉద్దేశంగా కనిపించిన ఖాజాను అశ్విన్‌ చక్కటి బంతితో పెవిలియన్‌ చేర్చాడు. అంపైర్‌ ధర్మసేన ఔటివ్వకున్నా, భారత్‌ సమీక్షకు వెళ్లి సఫలమైంది. 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో వచ్చిన హెడ్‌కు హ్యాండ్స్‌కోంబ్‌ సహకారం అందించాడు. ఈ దశలో కోహ్లి టీ అనంతరం బుమ్రాను రంగంలోకి దించడం సత్ఫలితాన్నిచ్చింది. అతడి బౌలింగ్‌లో హ్యాండ్స్‌కోంబ్‌... కీపర్‌ రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఉన్నంతసేపు ఇబ్బంది పడిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (5)ను ఇషాంత్‌ శర్మ  ఔట్‌ చేశాడు. 

వీరూ ‘ఏడు’పించారు... 
127/6... పైన్‌ వెనుదిరిగేటప్పటికి ఆసీస్‌ స్కోరిది. హెడ్‌ మినహా స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఔటవ్వగా ఆసీస్‌ సగం పరుగులు వెనుకబడే ఉంది. 150లోపే వారి ఇన్నింగ్స్‌ను ముగిస్తే భారత్‌కు మంచి ఆధిక్యం దక్కేది. కానీ, హెడ్‌ అడ్డుపడ్డాడు. బుమ్రా, ఇషాంత్, అశ్విన్‌లను దీటుగా ఎదుర్కొన్నాడు. వీలు చూసుకుని బౌండరీలు బాదాడు. 103 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. పరుగులు చేయకున్నా అవతలి ఎండ్‌లో కమిన్స్‌ పూర్తి సహకారం అందించాడు. వీరు ఏడో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. భారత ఇన్నింగ్స్‌లోనూ పెద్ద భాగస్వామ్యం (పుజారా–అశ్విన్‌ 62 పరుగులు) ఏడో వికెట్‌కే నమోదవడం విశేషం. అయితే, ప్రమాదకరంగా మారుతున్న హెడ్‌–కమిన్స్‌ జోడీని 81వ ఓవర్లో కొత్త బంతి అందుకున్న బుమ్రా విడదీశాడు. కమిన్స్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ సమీక్ష కోరినా ఔటనే తేలింది. మిగతా ఓవర్లను హెడ్, స్టార్క్‌ (8 బ్యాటింగ్‌) జాగ్రత్తగా ఆడి మరో వికెట్‌ పడకుండా ఆట ముగించారు. సొంతగడ్డపై ఆసీస్‌ రోజంతా ఆడినా 2.17 రన్‌రేట్‌తోనే పరుగులు చేయగలిగింది.  

బౌలర్లూ భేష్‌... షమీ మినహా! 
షమీ మినహా శుక్రవారం టీమిండియా బౌలర్లంతా చక్కటి లయలో కనిపించారు. హెడ్‌–కమిన్స్‌ జోడీని విడదీయడంలో ఆలస్యం చేయడం కొంత దెబ్బకొట్టినా, మొత్తమ్మీద వారి శ్రమను తక్కువ చేయలేం. ముఖ్యంగా ఇటీవలి విదేశీ వైఫల్యాల నుంచి అశ్విన్‌ బయటపడ్డాడు. కోహ్లి మొదట్లోనే తనకు బంతి ఇచ్చినందుకు న్యాయం చేశాడు. అతడు వరుసగా 22 ఓవర్లు వేయడం విశేషం. అనుభవం లేని ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు ఇషాంత్, బుమ్రాలను కాచుకోవడం పెద్ద పనే అయింది. ఓ దశలో బుమ్రా 10 ఓవర్లు వేసి ఐదే పరుగులివ్వడం గమనార్హం. షమీ మాత్రమే తేలిపోయాడు. తొలి మూడు ఓవర్లను మెయిడెన్‌గా వేసిన అతడు తర్వాత గాడితప్పాడు. కొన్ని మంచి బంతులేసినా అవి వికెట్‌ ఇవ్వకపోగా, తన ప్రధాన బలహీనత అయిన పరుగులివ్వడాన్ని నిరోధించలేకపోయాడు. బ్యాటింగ్‌ సందర్భంగా కుడి భుజానికి బంతి తగలడం కూడా ప్రభావం చూపినట్లుంది.  

మూడో రోజు కీలకం... 
మ్యాచ్‌లో ప్రస్తుతం అటు ఆసీస్‌ ఇటు భారత్‌ సమఉజ్జీగా ఉన్నాయి. మిగిలిన మూడు వికెట్లకు జోడించే పరుగులు ఆతిథ్య జట్టుకు కీలకం కానుండగా, వారిని సాధ్యమైనంత త్వరగా ఔట్‌ చేసి రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు ద్వారా ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు టీమిండియా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శనివారం ఆట కీలకం కానుంది. తొలి టెస్టును గెలిచి, ఆసీస్‌ పర్యటనను అద్భుతంగా ప్రారంభించే అవకాశం ఇప్పుడు భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌పై సమంగా ఉంది. 

మ్యాచ్‌ పోటాపోటీగా ఉంది. బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని రెండు వైపుల నుంచి ఒత్తిడికి గురిచేశాం. పిచ్‌ క్రమంగా నెమ్మదిస్తోంది. రాబోయే రెండు రోజులు ప్రతి పరుగూ కీలకమే. అవకాశాలను అందిపుచ్చుకున్నవారి వైపే ఫలితం మొగ్గుతుంది. పిచ్‌ నుంచి అందిన సహకారంతో బ్యాట్స్‌మెన్‌ను ఆత్మరక్షణలోకి నెట్టగలిగాను. దాని ఫలితంగానే ఖాజా, మార్‌‡్ష వికెట్లు దక్కాయి.    
  – భారత ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 

ఇదో కఠినమైన రోజు. పరుగులు కష్టంగా వచ్చాయి. భారత్‌ బౌలింగ్‌ బాగుంది. హెడ్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. మేం పోరాడుతున్నాం. పోటీలో ఉన్నాం. బౌలర్లపై ఒత్తిడి పెంచాలంటే వేగంగా పరుగులు సాధించాలి. కానీ, పిచ్‌ అలా లేదు. వేగాన్ని మారుస్తూ అశ్విన్‌ వైవిధ్యంగా బంతులేశాడు. మిగతా రెండు రోజుల్లో పిచ్‌ స్పిన్‌కు అనుకూలించవచ్చు. మా స్పిన్నర్‌ లయన్‌ ప్రభావం చూపే అవకాశం ఉంది.   
  – హారిస్, ఆసీస్‌ ఓపెనర్‌   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా