వేల సంఖ్యలో దరఖాస్తులు.. జయవర్థనే దూరం?

1 Aug, 2019 16:05 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ ప్రధాన కోచ్‌ పదవికి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయట. దాదాపు రెండు వేల దరఖాస్తులు ప్రధాన కోచ్‌ పదవి కోసం వచ్చినట్లు జాతీయ పత్రిక బెంగళూరు మిర్రర్‌ పేర్కొంది. ఆసీస్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ టామ్‌ మూడీతో పాటు న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌, కింగ్స్‌ పంజాబ్‌ కోచ్‌ మైక్‌ హెస్సెన్‌లు దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.  మరొకవైపు భారత్‌ నుంచి రాబిన్‌సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి కోచ్‌ పదవి కోసం నిర్వహించే ఇంటర్యూకు నేరుగా హాజరవుతాడు.

కాగా, భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా జయవర్థనే ఎంపిక ఖాయమని తొలుత భావించినా అందుకు అతడు ఆసక్తి చూపలేదని స్సష్టం చేసింది. అసలు జయవర్థనే కోచ్‌ పదవికి దరఖాస్తే చేసుకోలేదట. విండీస్‌ పర్యటనకు బయల్దేరే క్రమంలో కోచ్‌గా రవిశాస్త్రికి తన ఓటు అంటూ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బహిరంగంగా వెల్లడించడంతో జయవర్థనే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న రవిశాస్త్రి పదవీకాలం వరల్డ్‌కప్‌తోనే పూర్తైన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ పర్యటన వరకూ అతడి పదవీకాలాన్ని బీసీసీఐ ఇటీవల పొడిగించింది. విండీస్‌ పర్యటనలో టీమిండియా మూడు టీ20, మూడు వన్డేలతో పాటు, రెండు టెస్టులు ఆడనుంది. కపిల్‌దేవ్‌ నేతృత్వలో కొత్తగా ఏర్పాటైన క్రికెట్‌ సలహా కమిటీ.. త్వరలోనే ఈ దరఖాస్తులను పరిశీలించి కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది.

మరిన్ని వార్తలు