డబుల్‌ ధమాకా 

10 Oct, 2018 01:12 IST|Sakshi

యూత్‌ ఒలింపిక్స్‌లో ఒకే రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు

బంగారు పతకాలు నెగ్గిన షూటర్‌ మను భాకర్, వెయిట్‌లిఫ్టర్‌ జెరెమి

‘పసిడి’ ప్రదర్శనతో కొత్త చరిత్ర

ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది.  యూత్‌ ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో భారత క్రీడాకారులు పసిడి ఖాతా తెరిచారు. ఒకేరోజు రెండు స్వర్ణాలతో అదరగొట్టారు. మొదట వెయిట్‌లిఫ్టింగ్‌లో జెరెమి లాల్‌రినుంగా... ఆ తర్వాత మను భాకర్‌ ‘పసిడి’ ప్రదర్శనతో మెరిశారు. 

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): భారీ అంచనాలతో బరిలోకి దిగి... కీలకదశలో ఒత్తిడిని అధిగమించి... వెయిట్‌లిఫ్టర్‌ జెరెమి లాల్‌రినుంగా... షూటర్‌ మను భాకర్‌ యూత్‌ ఒలింపిక్స్‌లో పసిడి కాంతులు విరజిమ్మారు. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌ 62 కేజీల విభాగంలో మిజోరం రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల జెరెమి 274 కేజీల బరువెత్తి చాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో యూత్‌ ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన తొలి క్రీడాకారుడిగా కొత్త చరిత్ర లిఖించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగిన ఈ ఈవెంట్‌లో జెరెమి స్నాచ్‌లో 124 కేజీలు... క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 150 కేజీలు బరువెత్తాడు. గత రెండేళ్లలో ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలిచిన జెరెమి... ఈ ఏడాది ఆరంభంలో ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌లో రజతం... ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు. 2011లో ఎనిమిదేళ్ల ప్రాయంలో ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ స్కౌట్స్‌లో చేరిన జెరెమి అక్కడే శిక్షణ తీసుకుంటున్నాడు. జెరెమి తండ్రి లాల్‌నీత్‌లువాంగా జాతీయస్థాయి బాక్సర్‌. ఆయన ఎనిమిది స్వర్ణాలు సాధించారు. మొదట్లో జెరెమి బాక్సర్‌ కావాలనుకున్న కోచ్‌ల సలహా మేరుకు వెయిట్‌లిఫ్టర్‌గా మారాడు. ‘స్వర్ణం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని భారత్‌కు పతకం అందించడమే నా లక్ష్యం’అని జెరెమి వ్యాఖ్యానించాడు. 

గురి అదిరింది... 
మహిళల షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో హరియాణాకు చెందిన 16 ఏళ్ల మను భాకర్‌ విజేతగా నిలిచింది. ప్రపంచకప్, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన మను... ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మాత్రం నిరాశ పరిచింది. అయితే యూత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి తన సత్తా చాటుకుంది. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో మను 236.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. లానా ఎనీనా (రష్యా–235.9 పాయింట్లు) రజతం, నినో ఖుట్సిబెరిడ్జె (జార్జియా–214.6 పాయింట్లు) కాంస్యం సాధించారు. 20 మంది షూటర్లు బరిలోకి దిగిన క్వాలిఫయింగ్‌లో మను 576 పాయింట్లు స్కోరు చేసి ‘టాపర్‌’గా నిలిచింది. ‘ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. ఆసియా క్రీడల్లో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఈ పతకంతో నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాను’ అని మను వ్యాఖ్యానించింది. 

వైష్ణవి నిష్క్రమణ... 
మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి పోరాటం లీగ్‌ దశలోనే ముగిసింది. గ్రూప్‌ ‘ఎఫ్‌’లో ఆమె రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచిన గాయ్‌ జెనీ (అమెరికా) క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. మంగళవారం రివా సపోనారా (పెరూ)తో జరిగిన మ్యాచ్‌లో వైష్ణవి 21–14, 21–8తో గెలిచింది. ఎనిమిది గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన వారు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తారు.

మరిన్ని వార్తలు