‘పంచ్‌’ పవర్‌...

22 Mar, 2018 01:02 IST|Sakshi

బాక్సింగ్‌లో దూసుకుపోతున్న హుసాముద్దీన్‌

అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలు

కామన్వెల్త్‌ పతకంపై గురి   

నాన్న బాక్సింగ్‌ గ్లవ్స్‌ను చూశాడు. ఆటపై ఆసక్తిని పెంచుకున్నాడు. అన్నయ్యలు విసిరిన పంచ్‌లను చూశాడు. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆట నేర్చుకునేందుకు కనీస స్థాయి సౌకర్యాలు లేకపోయినా... సరైన రీతిలో రింగ్‌ కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉన్నా... అతని పట్టుదల ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి. తన ఆటపై నమ్మకంతో కఠోరంగా శ్రమించిన ఆ యువ బాక్సర్‌ ఇప్పుడు భారత జట్టులో భాగంగా మారాడు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌కు చెందిన మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ విజయగాథ ఇది. ఇప్పుడు అతని లక్ష్యం ఒకటే... నాన్న, అన్నల కోరిక నెరవేర్చడం... ఒక మెగా ఈవెంట్‌లో భారత్‌ తరఫున పతకం సాధించి గర్వంగా నిలవడం. ప్రస్తుతం అదే లక్ష్యంతో అతను ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడల్లో పతకంపై దృష్టి పెట్టాడు.   

సాక్షి, హైదరాబాద్‌ : గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ నిలకడగా సాధించిన విజయాలు ఇప్పుడు భారత జట్టులో అవకాశం దక్కేలా చేశాయి. 2017లో బల్గేరియా టోర్నీలో రజతం, మంగోలియా ఉలన్‌బాటర్‌ కప్‌లో కాంస్యంతో పాటు 2018లో ప్రతిష్టాత్మక స్టాన్జా కప్‌లో కాంస్యం సాధించి హుసామ్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. కామన్వెల్త్‌ క్రీడల కోసం నిర్వహించిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో కూడా సత్తా చాటిన అతను తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. కామన్వెల్త్‌లో పాల్గొంటున్న ఎనిమిది మంది భారత బాక్సర్లలో 24 ఏళ్ల హుసామ్‌ ఒకడు. 56 కేజీల విభాగంలో అతను పోటీ పడనున్నాడు. 

ఐదేళ్లుగా భారత క్యాంప్‌లో... 
హుసామ్‌ కెరీర్‌లో 2012 కీలక మలుపు. సీనియర్‌ నేషనల్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత అతను జాతీయ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. అంతకు ముందు ఏడాది 2011లో క్యూబాలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నా ఫలితం రాలేదు. 2012లో ఆర్మేనియాలో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కూడా ఓటమి ఎదురైంది. ఆర్మీలో ప్రస్తుతం నాయక్‌ సుబేదార్‌ హోదాలో ఉన్న హుసామ్‌ 2015లో జరిగిన ప్రపంచ మిలిటరీ క్రీడల్లో కూడా పాల్గొన్నాడు. అయితే తన తప్పులు సరిదిద్దుకొని హుసామ్‌ మరింతగా శ్రమించాడు. ముఖ్యంగా పాటియాలాలోని ఎన్‌ఐఎస్‌లో ప్రత్యేక శిక్షణతో ఆట రాటుదేలింది. భారత కోచ్‌లు హుసామ్‌ను తీర్చిదిద్దారు. 2016లో గువాహటిలో జరిగిన సీనియర్‌ నేషనల్స్‌లో స్వర్ణం సాధించడంతో అతనిపై అంచనాలు పెరిగాయి. దానికి తగినట్లుగా వేర్వేరు అంతర్జాతీయ పోటీల్లో కూడా విజయాలు సాధించి అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ‘ఇప్పటి వరకు నేను సాధించిన విజయాలు ఒక ఎత్తు. ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడలు మరొక ఎత్తు. ఇలాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో గెలిస్తేనే ఇన్నేళ్ల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పతకం కోసం చాలా కష్టపడుతున్నా. గెలుస్తాననే నమ్మకం ఉంది’ అని హుసాముద్దీన్‌ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.

నాకు బాక్సింగ్‌పై ఉన్న అమితాభిమానమే నా నలుగురు కొడుకులను అదే ఆట వైపు మళ్లించింది. ఇద్దరు పెద్ద కొడుకుల ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నా... దేశం తరఫున పెద్ద ఈవెంట్‌లో పతకం సాధించలేకపోయారనే వెలితి ఉంది. దానిని హుసాముద్దీన్‌ తీరుస్తాడని నమ్ముతున్నా. అతడిది కష్టపడే స్వభావం. చాలా పట్టుదలగా ప్రాక్టీస్‌ చేస్తాడు. అందుకే మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాం. హుసామ్‌ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది నా కోరిక. ఇప్పుడే పతకం గురించి చెప్పను గానీ నిజంగా అతను అక్కడ గెలవగలిగితే తండ్రిగా అంతకు మించి గర్వకారణం ఏముంటుంది. 73 ఏళ్ల వయసులో కూడా కోచింగ్‌ ఇస్తున్నా. సౌకర్యాల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. సౌకర్యాలకంటే బాక్సర్ల కఠోర శ్రమనే వారిని ముందుకు తీసుకువెళుతుందనేది నా నమ్మకం. ఉన్నవాటితోనే సర్దుకొని శిక్షణ ఇచ్చాను. సాధారణ స్థాయి రింగ్‌ ఏర్పాటు చేసుకునేందుకు కూడా సొంతడబ్బు చాలా వెచ్చించాల్సి వచ్చింది. ఆరంభంలో ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా గానీ ఇప్పుడు దాని గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు. సాయం కావాలంటూ ఎప్పుడూ ప్రభుత్వంతో సహా ఎవరినీ కోరలేదు. జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగే వరకు నిజామాబాద్‌లో శిక్షణ ఇవ్వగలను. ఆ తర్వాత వారి సత్తానే వారిని ముందుకు తీసుకెళుతుంది. 
– షమ్‌షముద్దీన్, హుసాముద్దీన్‌ తండ్రి, కోచ్‌

బాక్సింగ్‌ ఫ్యామిలీ... 
హుసామ్‌ తండ్రి షమ్‌షముద్దీన్‌ ఒకప్పుడు జాతీయ స్థాయి బాక్సర్‌. ఆ తర్వాత కోచ్‌గా మారిన ఆయన స్వస్థలం నిజామాబాద్‌లోనే కొద్ది మందికి శిక్షణ ఇస్తూ వచ్చారు. చెప్పుకోదగ్గ వసతులు లేకపోయినా పరిమిత వనరులతోనే ఆయన బాక్సర్లను తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. అనేక మందితో పాటు ఆయన కుమారులు కూడా అక్కడే శిక్షణ పొందారు. హుసామ్‌ పెద్ద సోదరులు ఇద్దరు ఎహ్‌తెషామ్, ఎహ్‌తెసామ్‌ కూడా అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు. వీరిద్దరు స్పోర్ట్స్‌ కోటాలోనే రైల్వే, ఆర్మీలో ఉద్యోగాలు పొందడం విశేషం. హుసామ్‌ తమ్ముడు ఖయాముద్దీన్‌ కూడా బాక్సర్‌గా మారి ప్రస్తుతం జాతీయ స్థాయికి ఎదిగాడు. ఈ నేపథ్యం నుంచి వచ్చిన హుసామ్‌కు ఆటలో ఓనమాలు నేర్చుకోవడం కష్టం కాలేదు. మరింత పట్టుదలతో తన పంచ్‌ పవర్‌ను పెంచుకున్న అతను వేగంగా దూసుకుపోయాడు. 2007 స్కూల్‌ నేషనల్స్‌లో తొలిసారి పోటీ పడిన తర్వాత హుసామ్‌ ఆగలేదు. ‘నాకు ఆ సమయంలో తెలిసిందల్లా నాన్న ఏం చెబితే అది చేయడం. రింగ్‌ గురించి కానీ, ఇతర సౌకర్యాల గురించి గానీ ఎప్పుడూ ఆలోచించలేదు. నాన్నే అన్నీ చూసుకున్నారు. ఖర్చులు, డైట్‌లాంటివి కనీసం నాకు తెలియనివ్వలేదు కూడా. బాక్సింగ్‌ మొదలు పెట్టినప్పుడు లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టి నాన్న, అన్నయ్యలు సాధించలేని విజయాలు అందుకోవాలని మరింత పట్టుదలతో సాధన చేశాను’ అని హుసామ్‌ చెప్పాడు.  

మరిన్ని వార్తలు