వన్‌ అండ్‌ ఓన్లీ రో‘హిట్‌’

24 Dec, 2019 15:12 IST|Sakshi

రౌండప్‌- 2019

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే వేదికపై ఐపీఎల్‌ ఫైనల్లో స్వల్ప స్కోరును నమోదు చేసి ఒక్క పరుగుతో చాంపియన్‌గా నిలిచిన రోహిత్‌ సేన.. 2019 ఐపీఎల్‌లో కూడా మళ్లీ అదే అద్భుతాన్ని చేసి చూపించింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో 149 పరుగులకే పరిమితమై... చెత్త ఫీల్డింగ్, క్యాచ్‌లు, రనౌట్‌లు వదిలేసి కూడా చివరకు చిరకాల ప్రత్యర్థి చెన్నైపై పైచేయి సాధించగలిగింది.  ఐపీఎల్‌ ఫైనల్స్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ తమ అద్భుత రికార్డును కొనసాగించింది. మూడో సారి కూడా ధోని సేనను చిత్తు చేసి ఐపీఎల్‌ –2019 విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా నాలుగోసారి టైటిల్‌ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. హైదరాబాద్‌లో జరిగిన టైటిల్‌ ఫైట్‌లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (41 నాటౌట్‌; 25  బంతుల్లో), డీకాక్‌(29; 17 బంతుల్లో)లు రాణించారు. ఆపై చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 148 పరుగులు చేసే ఓటమి పాలైంది. వాట్సన్‌(80; 59 బంతుల్లో) బ్యాట్‌ ఝుళిపించినా చెన్నైను విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.

ధోని రనౌటే మలుపు..
ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ ధోని కీలక సమయంలో రనౌట్‌ కావడం చెన్నై శిబిరాన్ని ఒక్కసారిగా ఆందోళనలో పడేసింది. హార్దిక్‌ బౌలింగ్‌లో వాట్సన్‌ ఫైన్‌లెగ్‌ వైపు ఆడగా సింగిల్‌ వచ్చింది. బంతిని ఆపి మలింగ విసిరిన త్రో నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌కు దూరంగా వెళుతుండటంతో ధోని రెండో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా దూసుకొచ్చిన ఇషాన్‌ కిషన్‌ నేరుగా వికెట్లపైకి కొట్టాడు. బంతి స్టంప్స్‌కు తగిలే సమయంలో బ్యాట్‌ క్రీజ్‌ గీతపైనే ఉంది. నిజానికి ధోని తనే ఔట్‌గా భావించి ముందే నడవటం మొదలు పెట్టినా ఫీల్డ్‌ అంపైర్లు అతడిని ఆపారు. సుదీర్ఘ సమయం పాటు పదే పదే రీప్లేలు చూసిన అనంతరం చివరకు అంపైర్‌ నైజేల్‌ లాంజ్‌ ధోనిని ఔట్‌గా ప్రకటించాడు. ఈ వికెట్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు.  

చివరి 5 ఓవర్లలో...
ధోని వికెట్‌ పడ్డాక వాట్సన్‌తో పాటు పెద్దగా ఫామ్‌లో లేని బ్రేవో క్రీజ్‌లో ఉన్నాడు. 30 బంతుల్లో 62 పరుగులు చేయాల్సిన స్థితి చెన్నైకి కష్టంగానే కనిపిస్తోంది. అయితే 16వ ఓవర్లో మళ్లీ ఆట మారిపోయింది. మలింగ వేసిన ఈ ఓవర్లో బ్రేవో సిక్స్‌ బాదగా, వాట్సన్‌ 3 ఫోర్లు కొట్టాడు. దాంతో 20 పరుగులు వచ్చాయి. అప్పటి వరకు అద్భుత బౌలింగ్‌తో ప్రశంసలు అందుకున్న రాహుల్‌ చహర్‌... బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో వాట్సన్‌ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను వదిలేసి ప్రత్యర్థికి మరో అవకాశం కల్పించాడు. ఆ తర్వాత కృనాల్‌ పాండ్యా వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 6, 6 బాది వాట్సన్‌ చెలరేగిపోయాడు. దాంతో ఒక్కసారిగా మ్యాచ్‌ చెన్నై వైపు తిరిగింది. బ్రేవో (15) ఔటైనా, వాట్సన్‌ గెలిపించే స్థితిలో నిలిచాడు. అయితే చివరకు అదృష్టం సూపర్‌ కింగ్స్‌ మొహం చాటేసింది.  

వన్‌ అండ్‌ ఓన్లీ రో‘హిట్‌’..
ఐపీఎల్‌ చరిత్రలో ఐదు టైటిల్స్‌ విజయాల్లో పాలుపంచుకున్న ఏకైక ప్లేయర్‌ రోహిత్‌ శర్మ.. 2013, 2015, 2017, 2019లలో ముంబై జట్టుకు సారథ్యం వహించాడు. కాగా, 2009లో  చాంపియన్‌ అయిన డెక్కన్‌ చార్జర్స్‌ జట్టులో రోహిత్‌ సభ్యుడిగా ఉన్నాడు. దాంతో ఐదు ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఏకైక క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. ఇక ముంబై నెగ్గిన నాలుగు ఐపీఎల్‌ ఫైనల్స్‌లోనూ ఆ జట్టు ముందుగా బ్యాటింగ్‌ చేయడం ఇక్కడ  విశేషం.   ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన నాలుగు ఐపీఎల్‌ ఫైనల్స్‌లోనూ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలుపొందడం ఇక్కడ మరో విశేషం.  ఈ సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌(692 పరుగులు-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకున్నాడు. అత్యధిక వికెట్లు సాధించే బౌలర్‌కు ఇచ్చే పర్పుల్‌ క్యాప్‌ అవార్డు ఇమ్రాన్‌ తాహీర్‌(26 వికెట్లు-సీఎస్‌కే) దక్కించుకున్నాడు. పర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌ అవార్డు కీరోన్‌ పొలార్డ్‌కు దక్కింది. ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డును శుబ్‌మన్‌ గిల్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌) అందుకోగా, ఫెయిర్‌ ప్లే అవార్డును సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎగరేసుకుపోయింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా