‘పట్టు’ నిలబడేనా!

8 Sep, 2013 02:05 IST|Sakshi

ఒలింపిక్స్‌లో చోటు కోసం
 స్క్వాష్‌తో రెజ్లింగ్ పోటీ
 బరిలో బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ కూడా
 నేడు ఖరారు చేయనున్న ఐఓసీ

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగు వ్యక్తిగత పతకాలు అందించిన రెజ్లింగ్ భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. 2020 ఒలింపిక్స్‌లో చేర్చాల్సిన ఒక క్రీడ కోసం బ్యూనస్ ఎయిర్స్‌లో ఆదివారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కానుంది. ఏ క్రీడను చేర్చాలో నిర్ణయించేందుకు ఈ సమావేశంలో ఓటింగ్ జరుగుతుంది. 2020 ఒలింపిక్స్‌లో చోటు కోసం రెజ్లింగ్‌తో పాటు స్క్వాష్, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ (సంయుక్తంగా) పోటీ పడుతున్నాయి.
 
 ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు ఐఓసీ సూచించిన సవరణలు పాటించి రెజ్లింగ్ తమ అవకాశాలు మెరుగుపర్చుకోగా... చక్కటి టీవీ ప్రజెంటేషన్‌తో స్క్వాష్ కూడా గత ఐఓసీ సమావేశంలో ఆకట్టుకుంది. పేరుకు మూడు ఆటలు ఉన్నా ప్రధానంగా రెజ్లింగ్, స్క్వాష్ మధ్యే గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు క్రీడలకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తే...
 
 రెజ్లింగ్
 1900వ సంవత్సరంలో మినహా ప్రతీసారి రెజ్లింగ్ ఒలింపిక్స్‌లో భాగమైంది. ప్రాచీన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఆటగా కుస్తీకి పోటీ ఉంది. ఏడు నెలల క్రితం ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్‌ను తొలగిస్తున్నామని ఐఓసీ ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ఈ క్రీడలో కొత్త మార్పులతో ముందుకు వచ్చింది. ఒలింపిక్స్‌లో మహిళల కోసం కూడా మరిన్ని కేటగిరీలు పెంచేందుకు సిద్ధమైంది. దీని వల్లే రెజ్లింగ్ తుది జాబితాలో నిలిచింది. ఆరు ఖండాలకు చెందిన 177 దేశాల్లో ప్రాచుర్యంలో ఉండటం... గత లండన్ ఒలింపిక్స్‌లో 71 దేశాలు పాల్గొనడంతో పాటు 29 దేశాలకు చెందిన వారు పతకాలు గెల్చుకోవడం రెజ్లింగ్‌కు అనుకూలాంశం. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు నెజాది ఈ ఆటను కొనసాగించాలని బహిరంగంగా మద్దతు పలికారు.
 
 
 స్క్వాష్
 ఇప్పటి వరకు స్క్వాష్ ఒలింపిక్స్‌లో లేదు. ఒలింపిక్స్‌లో చోటు పొందేందుకు గత పదేళ్లుగా పోరాడుతున్నట్లు స్క్వాష్ సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఈ ఆటకు ప్రస్తుతం 185 దేశాల్లో ఆదరణ ఉందని, కొత్త తరం ఆటగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని స్క్వాష్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ క్రీడ ఇప్పటికీ టీవీలో గానీ, ప్రత్యక్షంగా గానీ చూసే ప్రేక్షకులకు కావాల్సిన మజాను అందించలేకపోతోంది. ‘స్క్వాష్ ప్రతినిధులు తమ ఆట గురించి అద్భుతమై ప్రజెంటేషన్ ఇచ్చారు’ అని ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు రీడీ వ్యాఖ్యానించడం అనుకూల పరిణామం. భారత క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్‌లతో పాటు ఫెడరర్, ముర్రేలాంటి టెన్నిస్ దిగ్గజాలు ఈ ఆటకు మద్దతుగా నిలిచారు.
 
 బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్
 ఒలింపిక్స్‌లో చోటు కోసం రెండు క్రీడలూ కలిసి సంయుక్తంగా పోటీ పడుతున్నాయి. ప్రపంచ బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ సమాఖ్య తమకు అవకాశం కల్పించాలంటూ బరిలో నిలిచింది. బేస్‌బాల్‌కు అమెరికాలో అమిత జనాదరణ ఉండగా, సాఫ్ట్‌బాల్‌ను 140 దేశాల్లో ఆడతారు. ఈ ఆటలో కొన్ని నిబంధనలు ఒలింపిక్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. తాము స్థానం దక్కించుకోవడం అంత సులువు కాదని సంబంధిత వర్గాలే అనుమానం వ్యక్తం చేశాయి. బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ కలిసి బిడ్ వేయడం పట్ల కూడా చాలా మందిలో అసంతృప్తి ఉంది. 1996 ఒలింపిక్స్‌లో తొలి సారి ప్రవేశించిన సాఫ్ట్‌బాల్‌ను ఆ తర్వాత తొలగించారు.


 

 

మరిన్ని వార్తలు