260 పరుగులు... 9 వికెట్లు

20 Jul, 2014 01:05 IST|Sakshi
260 పరుగులు... 9 వికెట్లు

రసవత్తరంగా శ్రీలంక, దక్షిణాఫ్రికా టెస్టు
 గాలే: విజయంపై ధీమాతో తమ రెండో ఇన్నింగ్స్‌ను 206/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన దక్షిణాఫ్రికా ఇప్పుడు చిక్కుల్లో పడింది. 370 పరుగుల ఆధిక్యం సాధించడంతో పాటు మ్యాచ్‌కు ఇంకా ఒకటిన్నర రోజుల సమయం ఉండడంతో శ్రీలంకను సులువుగానే ఆలౌట్ చేయవచ్చని సఫారీ జట్టు భావించింది. అయితే లంక ఆటగాళ్లు అంత సులువుగా లొంగలేదు. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 32 ఓవర్లలో వికెట్ నష్టానికి 110 పరుగులతో దీటైన జవాబిచ్చారు. ఇక చివరి రోజు ఆదివారం మరో 260 పరుగులు చేస్తే చాలు అద్భుత విజయాన్ని అందుకోవచ్చు.

 అందుకు తగ్గట్టుగానే లంక చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉండగా క్రీజులో సూపర్ ఫామ్‌లో ఉన్న సంగక్కర (89 బంతుల్లో 58 బ్యాటింగ్; 7 ఫోర్లు; 1 సిక్స్)తో పాటు ఓపెనర్ సిల్వ (90 బంతుల్లో 37 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఉన్నాడు. మూడో ఓవర్‌లోనే తరంగ (13 బంతుల్లో 14; 2 ఫోర్లు) అవుట్ కావడంతో సఫారీల నిర్ణయం సరైనదే అనిపించినా సంగ, సిల్వ జోడి రెండో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించింది. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో వీలైనంత త్వరగా పరుగులు సాధించి ప్రత్యర్థి ముందు భారీ ఆధిక్యం ఉంచాలనే భావనతో ఆడింది. 50.2 ఓవర్లలో 206/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తూ కెప్టెన్ ఆమ్లా సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు.
 

మరిన్ని వార్తలు