లార్డ్స్లో నేడు యాషెస్ రెండో టెస్టు

18 Jul, 2013 11:37 IST|Sakshi
లార్డ్స్లో నేడు యాషెస్ రెండో టెస్టు

లండన్ : ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఎదురుదాడికి ఆస్ట్రేలియా సిద్ధమైంది. ఈ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్ 14 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. హోరాహోరీగా పోరాడినప్పటికీ ఆసీస్ ఈ మ్యాచ్‌ని చేజార్చుకోవడానికి అంపైరింగ్ తప్పిదాలు కూడా కారణమయ్యాయి. ప్రత్యేకించి స్టువర్ట్ బ్రాడ్‌ను నాటౌట్‌గా ఫీల్డ్ అంపైర్ అలీం దార్ ప్రకటించడం, థర్డ్ అంపైర్ కూడా అతని నిర్ణయాన్ని సమర్థించడం ఆసీస్‌ను దారుణంగా దెబ్బతీశాయి. కారణాలు ఏవైనా ఫలితం తమకు ప్రతికూలంగా రావడంతో, మైఖేల్ క్లార్క్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలతో బరిలోకి దిగుతోంది.

‘క్రికెట్ మక్కా’గా ప్రసిద్ధి చెందిన లార్డ్స్ మైదానంలో జరిగే రెండో టెస్టును గెల్చుకోవడం ద్వారా ఇంగ్లాండ్‌కు సమవుజ్జీలమని నిరూపించుకునే ప్రయత్నంలో పడింది. ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఎడ్ కోవన్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో, అతని స్థానంలో బౌలర్ ఉస్మాన్ ఖాజాకు అవకాశం దక్కవచ్చని విశే్లషకుల అభిప్రాయం. అయితే, మికీ ఆర్థర్ స్థానంలో చీఫ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన డారెన్ లీమన్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

కాగా, తొలి టెస్టులో సెంచరీ సాధించి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇయాన్ బెల్ మరోసారి రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. జొనథాన్ ట్రాట్, కెప్టెన్ అలిస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్ తమవంతు బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తే ఇంగ్లాండ్ విజయం ఖాయమని అంటున్నారు.

మ్యాచ్కు హాజరు కానున్న బ్రిటన్ రాణి
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటను బ్రిటన్ రాణి ఎలిజబెత్ తిలకించనుంది. ఇరు జట్ల కెప్టెన్లను, అధికారులను ఆమెకు పరిచయం చేసిన తర్వాత మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

మరిన్ని వార్తలు